Sep 11,2023 23:55

గుంటూరు ఆర్టీసీ బస్టాండ్‌ బస్సులపైకి ఎక్కి ఆందోళన చేస్తున్న టిడిపి శ్రేణులు

ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా గుంటూరు, పల్నాడు జిల్లాల్లో కొన్ని చెదురుమదురు ఘటనలు మినహా బంద్‌ ప్రశాంతంగా జరిగింది. టివడిపి కార్యకర్తలు, నాయకులను పోలీసులు ఎక్కడెక్కడ అరెస్టు చేశారు. విద్యా సంస్థలకు ముందే సెలవులు ప్రకటించారు. కొన్ని వ్యాపార సంస్థల వారు మధ్యాహ్నం వరకు వాణిజ్య సముదాయాలను తెరవలేదు. ఉదయం కొద్దిసేపు ఆర్‌టిసి బస్సులు నిలిచిపోయాయి. బ్యాంకులు మూతపడ్డాయి. దుకాణాలు, వాణిజ్య సంస్థలు ఉదయం వేళ పనిచేయలేదు. ప్రైవేటు వాహనాలు, చిన్న దుకాణాలు యథాతథంగా పనిచేశాయి. 144 సెక్షన్‌ అమలులో ఉన్నా చాలాచోట్ల ర్యాలీలు, నిరసన ప్రదర్శనలు, రాస్తారోకోలు నిర్వహించారు. సత్తెనపల్లి, నర్సరావుపేటలో అరెస్టయిన టిడిపి నాయకులకు సిపిఎం నాయకులు సంఘీభావం ప్రకటించారు. గుంటూరులో మాజీ మంత్రులు కన్నా లక్ష్మీనారాయణ, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్‌, నక్కా ఆనంద్‌బాబు, చిలకలూరిపేటలో పత్తిపాటి పుల్లారావు తదితరులను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. తాడేపల్లిలో టిడిపి జిల్లా అధ్యక్షులు తెనాలి శ్రావణ్‌కుమార్‌ను బయటకు రానివ్వలేదు.
పిడుగురాళ్ల, సత్తెనపల్లి తదితర ప్రాంతాల్లో టిడిపి కార్యకర్తలు సెల్‌ టవర్లు ఎక్కి నిరసన తెలిపారు. వినుకొండ, గురజాల తదితర ప్రాంతాల్లో గుర్తు తెలియని వ్యక్తులు ఆర్‌టిసి బస్సులపై రాళ్లు రువ్వారు. బంద్‌లో టిడిపితో పాటు జనసేన నాయకులు కూడా పాల్గొన్నారు. సీనియర్‌ నాయకులు అందర్నీ గృహ నిర్బంధం చేశారు. గుంటూరులో మూసిన షాపులను వైసిపి నాయకులు తెరిపించడంతో వివాదానికి దారితీసింది. మేయర్‌, ఎమ్మెల్యే మద్దాళి గిరిధర్‌ తీరునకు నిరసనగా జనసేన నాయకులు మరోసారి ఆందోళనకు పూనుకున్నారు. మద్దాల గిరి, మేయర్‌ కావటి మనోహర్‌ నాయుడు ఆధ్వర్యంలో కర్రలు తీసుకొని హల్‌ చల్‌ చేయడంతో తీవ్ర వివాదానికి దారితీసింది. పోలీసు లాఠీలతో మేయర్‌ దుకాణాలు తెరిపించడం ఏమిటని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాసయాదవ్‌ పోలీసులతో వాగ్వివాదానికి దిగారు.
గుంటూరు ఆర్‌టిసి బస్టాండ్‌లో బస్సులపైకి వెళ్లి బయటకు వెళ్తున్న బస్సులను టిడిపి నాయకులు నశీర్‌ అహ్మద్‌ అడ్డుకున్నారు. గుంటూరులో డిపోల నుంచి బయటకు వెళ్తున్న బస్సులను తెలుగు యువత జిల్లా అధ్యక్షులు రావిపాటి సాయికృష్ణ ఆధ్వర్యంలో గాలి తీసి నిలువరించారు. బస్సులపైకి ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. తాడేపల్లిలో సిఎం జగన్‌ దిష్టిబొమ్మను టిడిపి నాయకులు దహనం చేశారు. కుంచనపల్లిలో టిడిపి, జనసేన నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. తెనాలిలో జరిగిన బంద్‌లో టిడిపి, జనసేన నాయకులు పాల్గొన్నారు. తాడికొండ, పెదకాకానిలో బంద్‌ ప్రశాంతంగా జరిగింది. ప్రత్తిపాడులో అరెస్టు చేసిన నాయకులకు నల్లపాడుపోలీసు స్టేషన్‌లో టిడిపి నియోజకవర్గం ఇన్‌ఛార్జి బి.రామాంజనేయులు పరామర్శించారు. మంగళగిరిలో టిడిపి, జనసేన, ఎమ్మార్పీఎస్‌, సిపిఐ ఆధ్వర్యంలో ర్యాలీలు నిర్వహించారు. పాత టైరు తగలబెట్టారు. కొంతమంది సిఎం జగన్‌ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. పల్నాడు జిల్లా వినుకొండలో బంద్‌ సంపూర్ణంగా జరిగింది. టిడిపి, జనసేన, సిపిఐ పార్టీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకొని స్టేషన్‌ తరలించారు. యడ్లపాడులో టిడిపి నాయకులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన ర్యాలీ నిర్వహించారు. పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్‌ను గుంటూరులో గృహనిర్బంధంలో ఉంచారు. మాచర్లలో బంద్‌ ప్రభావం కన్పించలేదు. పిడుగురాళ్లలో టిడిపి నాయకులు నిర్వహించిన బంద్‌ ప్రశాంతంగా ముగిసింది.