బలవంతపు భూసేకరణ తగదు : సిపిఎం
ప్రజాశక్తి - బనగానపల్లె
బనగానపల్లె మండలం యనకండ్ల గ్రామ పరిధిలో ఉన్న జయ జ్యోతి సిమెంట్ పరిశ్రమకు రైల్వే లైన్ కోసం రైతుల భూములను వారి అంగీకారం లేకుండా బలవంతంగా సేకరణ, సర్వే చేయడం సరైంది కాదని సిపిఎం జిల్లా కార్యదర్శి టి.రమేష్ కుమార్, జిల్లా నాయకులు సుధాకర్ తీవ్రంగా ఖండించారు. బుధవారం పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. పరిశ్రమకు భూములు తీసుకోవాలంటే రైతులను సమావేశపరిచి 2013 భూసేకరణ చట్టం ప్రకారం వాటి విలువ ఇచ్చి, అంగీకారంతోనే సర్వే చేయాలన్నారు. రైతుల అంగీకారం లేకుండా పోలీస్ పహారాలో బలవంతంగా అధికారులు సర్వే చేయడం తగదన్నారు. రైతుల పక్షాన సిపిఎం నిలబడుతుందని తెలిపారు. మహా సిమెంట్ యాజమాన్యం ఇష్టానుసారంగా క్లషర్‌ను టిప్పర్లు, ట్రాక్టర్ల ద్వారా పట్టణంలో తిప్పడం వల్ల ప్రజలు కాలుష్యంతో ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. పాతపాడు, మీరాపురం గ్రామాలకు సంబంధించిన వందల ఎకరాల్లో మైనింగ్‌ను అక్రమంగా తవ్వుకుంటున్నారని అన్నారు. భూములు కోల్పోయిన స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వడం లేదన్నారు. సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యం రస్తా వదలకుండా కంచెలు వేసి రైతులను పొలాలకు వెళ్లకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుందని తెలిపారు. చుట్టుపక్కల గ్రామాల్లో పరిశ్రమ వల్ల కాలుష్యానికి గురవుతున్నా ఎటువంటి వైద్య సదుపాయాలు, నష్టపరిహారం ఇవ్వడం లేదన్నారు. గ్రామాల అభివృద్ధికి కృషి చేయడం లేదన్నారు. దీనిపై ఉన్నత అధికారులు చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో రైతులతో పాటు ఇతర సంఘాలను కలుపుకొని సిపిఎంగా పరిశ్రమ దగ్గర ఆందోళన చేపడతామని హెచ్చరించారు. సమావేశంలో సిపిఎం నాయకులు వెంకటసుబ్బయ్య, అర్జున్ బాషా, దస్తగిరి పాల్గొన్నారు.










