ప్రజాశక్తి -భీమునిపట్నం, పద్మనాభం : పద్మనాభం మండలం, నేరెళ్లవలసలో బలవంతపు భూసేకరణ నిలిపివేయాలని కోరుతూ స్థానిక ఆర్‌డిఒ ఎస్.భాస్కరరెడ్డికి సిపిఎం నాయకులు గురువారం వినతిపత్రం అందజేశారు. ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే నోటీసులు ఇవ్వడంపై సంబంధిత రైతుల్లో ఆందోళన నెలకొందని వినతిలో పేర్కొన్నారు. తాతతండ్రుల నుంచి భూమినే నమ్ముకుని జీవిస్తున్న రైతుల పట్ల కింది స్థాయి రెవెన్యూ అధికారులు, సిబ్బంది వ్యవహరిస్తున్న తీరు వల్ల రైతుల కుటుంబాలు ఆవేదన చెందుతున్నాయని వివరించారు. రైతుల పట్ల కొందరు అధికార పార్టీ నాయకులు దురుసుగా ప్రవర్తిస్తున్నారని, భయపెట్టి భూమిని లాక్కునే ప్రయత్నం చేయడం అన్యాయమని పేర్కొన్నారు. ఆర్‌డిఒకు వినతిపత్రం అందజేసిన వారిలో సిపిఎం నాయకులు ఆర్‌ఎస్‌ఎన్ మూర్తి, రవ్వ నరసింగరావు, రైతులు ఎర్రబాబు, రాంప్రసాద్, స్వామినాయుడు, నారాయణప్పుడు సతీష్ ఉన్నారు.










