Feb 09,2023 23:57

ఆందోళన చేస్తున్న రైతు సంఘం, సిపిఎం నాయకులు, రైతులు

ప్రజాశక్తి-మునగపాక రూరల్‌
బలవంతపు భూసేకరణకు దిగితే సహించేది లేదని సిపిఎం మండల కన్వీనర్‌ ఎస్‌ బ్రహ్మాజీ హెచ్చరించారు. మండలంలోని గ్యాస్‌ పైప్‌ లైన్‌ ద్వారా భూములు కోల్పోతున్న రైతులకు మెరుగైన పరిహారం అందజేయాలని కోరుతూ ఏపీ రైతు సంఘం, సిపిఎం ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం వద్ద గురువారం ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా బ్రహ్మాజీ మాట్లాడుతూ గ్యాస్‌ పైప్‌లైన్‌కు రైతుల నుండి ఏపీ జిడిసి సేకరిస్తున్న భూములకు పరిహారం అందజేసే విషయంలో స్పష్టమైన హామీ లేకుండానే భూముల డాక్యుమెంట్లు ఇవ్వాలని రైతులను బెదిరింపులకు, ఒత్తిళ్లకు గురి చేయడం దారుణమన్నారు. రైతుకు సెంటుకు లక్ష రూపాయలు, పంటకు 10 సంవత్సరాల పాటు నష్ట పరిహారం ఇవ్వాలని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని, పైప్‌లైన్‌ వెళ్లే గ్రామాల రైతు కుటుంబాలకు రూ.50 లక్షలు ఇన్సూరెన్స్‌ చేయించాలని డిమాండ్‌ చేశారు. ఈ డిమాండ్లను నెరవేర్చిన తరువాతనే భూముల వద్దకు అడుగు పెట్టాలని బ్రహ్మజీ స్పష్టం చేశారు. అనంతరం రైతులతో కలిసి ఇన్‌ఛార్జి తహశీల్దార్‌ వినరుకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు వివి శ్రీనివాసరావు, మునగపాక, తిమ్మరాజుపేట, మూలపేట గ్రామాల రైతులు దొడ్డి నాగభూషణం, ఆడారి సాంబమూర్తి, మల్ల సత్యనారాయణ, బొడ్డేడ వెంకట్రావు, ఆడారి నూకరాజు, మల్ల శివ, మల్ల ప్రసాద్‌, శరగడం పరదేశిరావు తదితరులు పాల్గొన్నారు.