Oct 13,2023 22:01

తహశీల్దార్‌కు వినతి అందిస్తున్న ఎపి రైతుసంఘం నాయకులు, రైతులు

ప్రజాశక్తి-శృంగవరపుకోట :  పోలవరం ఎడమ కాలువ నిర్మాణానికి బలవంతపు భూసేకరణ ఆపాలని ఎపి రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి మద్దిల రమణ డిమాండ్‌ చేశారు. పోలవరం ఎడమ కాలువ భూ బాధిత రైతుల సమస్యలపై తహశీల్దార్‌ కార్యాలయం వద్ద ఎపి రైతు సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా మద్దిల రమణ మాట్లాడుతూ రైతుల అనుమతి లేకుండా ఏ హక్కుతో జిరాయతీ భూముల్లో అధికారులు అడుగు పెడుతున్నారని తహశీల్దార్‌ శ్రీనివాసరావును ప్రశ్నించారు. తహశీల్దార్‌ స్పందిస్తూ ఏరకమైన ఆదేశాలూ రాలేదన్నారు. పోలవరం కాలువకు సంబంధించిన కాంట్రాక్టు వర్కర్స్‌ వచ్చి సర్వే పాయింట్లు మాకు అర్థం కాలేదని, మండల సర్వేయర్‌ను పంపిస్తే అవి చూపిస్తారని అడిగారని తెలిపారు. ముందస్తుగా సమాచారం ఇవ్వకుండా రైతుల భూముల్లోకి దౌర్జన్యంగా వస్తే సహించేది లేదని రమణ హెచ్చరించారు. పోలవరం కాలువ పాత డిజైన్‌ ప్రకారమే పనులు చేపట్టాలన్నారు. సర్వేయర్‌ వెంకట్రావు రైతులతో అసభ్యకర పదజాలం వాడటంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. సర్వేయర్‌ వ్యవహార శైలి మార్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వసంత సత్యం, సరిస సూరి అప్పారావు, సిహెచ్‌ గౌరీశ్వరి, సూర్జం, సిహెచ్‌ భవాని, అంబటి అప్పారావు, కోటాన సన్యాసమ్మ, చింతాడ బంగారమ్మ, చింతాడ కృష్ణమ్మ పాల్గొన్నారు.