Jul 20,2022 00:53

మాట్లాడుతున్న నారాయణరాజు

ప్రజాశక్తి - విశాఖపట్నం ప్రతినిధి
రైతుల సమ్మతి లేకుండా ప్రభుత్వం బలవంతంగా భూములు తీసుకోవడం సరికాదని నీటిపారుదలశాఖ విశ్రాంత సూపరింటెండెంట్‌ ఇంజినీర్‌ యు.నారాయణరాజు అన్నారు. భూములు కోల్పోతున్న రైతులకు న్యాయమైన రేటు చెల్లించాలన్నారు. బాబూ జగజ్జీవన్‌రామ్‌ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు నిర్మాణం, ప్రాధాన్యతపై ఎపి రైతు సంఘం, కౌలురైతు సంఘం సంయుక్తంగా అనకాపల్లిలోని కార్మిక, కర్షక భవన్‌లో బుధవారం నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. ప్రాజెక్టు నిర్మాణంలో భూములు కోల్పోతున్న నిర్వాసితులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదన్నారు. చిన్న, సన్నకారు రైతులు ఎక్కువ నష్టపోకుండా అవసరమైతే కెనాల్‌ ఎలైన్‌మెంట్‌ మార్చాలన్నారు. ప్రాజెక్టు విలువ కొద్దిగా పెరిగినా, చిన్న రైతుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఎలైన్‌మెంట్‌ మార్చడం సముచితంగా వుంటుందన్నారు. నిర్వాసితులకు పూర్తి పరిహారం చెల్లించిన తరువాతే ప్రాజెక్టు పనులు ప్రారంభించాలని సూచించారు. సుజల స్రవంతి పూర్తయితే ఉమ్మడి విశాఖపట్నంలోని గ్రామీణ ప్రాంతం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఏడు లక్షల ఎకరాలకుపైగా సాగునీటి సౌకర్యం లభిస్తుందన్నారు. విశాఖ నగర ప్రజలకు తాగునీరు, పరిశ్రమలకు సరిపడా నీరు సరఫరా చేయవచ్చన్నారు. పోలవరం ఎడమ కాలువ పనులు సకాలంలో పూర్తి చేయాలన్నారు. ఎడమ కాలువ, సుజల స్రవంతి పూర్తయితే వర్షాధారంపై సాగుచేసే విస్తీర్ణం తగ్గుతుందన్నారు. ఎపి రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మర్రాపు సూర్యనారాయణ మాట్లాడుతూ సుజల స్రవంతి పనులు సజావుగా, సకాలంలో పూర్తికావాలంటే, అందుకు భూములిస్తున్న రైతులకు న్యాయమైన పరిహారం ప్రభుత్వం చెల్లించాలన్నారు. ప్రస్తుత మార్కెట్‌ ధరలను దృష్టిలో పెట్టుకొని పరిహారం ఇవ్వాలన్నారు. గ్రామసభలు ఏర్పాటు చేసి రైతుల అభిప్రాయాలు తీసుకోవాలన్నారు. రైతు సమ్మతి తీసుకోకుండా భూములు తీసుకుంటే ప్రాజెక్టు పనులు ముందుకుసాగవన్నారు. ఈ కార్యక్రమంలో ఎపి రైతు సంఘం అనకాపల్లి జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కర్రి అప్పారావు, ఎం.అప్పలరాజు, విశ్రాంత ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ శేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు.