టోక్యో ఒలింపిక్స్ ఆదివారం ముగిశాయి. చివరి రోజు మూడు పసిడి పతకాలు గెలుచుకున్న అమెరికా పతకాల పట్టికలో అగ్ర స్థానానికి ఎగబాకింది. 39 స్వర్ణాలు, 41 రజితాలు, 33 కాంస్యాలతో మొత్తం 113 పతకాలతో అది మొదటి స్థానంలో నిలవగా, చైనా 38 స్వర్ణాలు, 32 రజితాలు, 18 కాంస్యాలు మొత్తం 88 పతకాలతో రెండో స్థానంలో నిలిచింది. ఆ తరువాతి స్థానాన్ని ఆతిథ్య దేశం జపాన్ దక్కించుకుంది. ప్రపంచంలో మూడు అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలుగా ఉన్న ఈ మూడు దేశాలు టోక్యోలో అదే వరుసలో నిలవడం కాకతాళీయం. జనాభా పరంగా ప్రపంచంలో చైనా తరువాత రెండవ అతి పెద్ద దేశంగా ఉన్న మన దేశం ఒక స్వర్ణం, రెండు రజితాలు, నాలుగు కాంస్యాలు మొత్తం ఏడు పతకాలతో 48వ స్థానంలో నిలిచింది. ఒలింపిక్స్‌లో భారత్ ఏడు పతకాలు సాధించడం ఇదే మొదటిసారి. ఎంతో చెమటోడ్చి ఈ ఘనతకు కారణమైన అథ్లెట్లు గోల్డెన్ బారు నీరజ్ చోప్రా, వరుసగా రెండు ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన తొలి మహిళా క్రీడాకారిణి పి.వి సింధు (బ్యాడ్మింటన్), రవి దహియా (కుస్తీ), లవ్లీన్ బోర్గొహైన్ (బాక్సింగ్), మీరాబాయి చాను (వెయిట్ లిఫ్టింగ్), బజరంగ్ పునియా (కుస్తీ), 41 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తరువాత హాకీలో తొలిసారి పతకాన్ని అందించిన పురుషుల హాకీ జట్టుకు జేజేలు. పతకం రాకున్నా మంచి ప్రతిభా సామర్థ్యం కనబరచిన ఇతర అథ్లెట్లు భవానీ దేవి (ఫెన్సింగ్), అదితి అశోక్ (గోల్ఫ్), మీర్జా (ఈక్వెస్ట్రియన్), తొలిసారి సెమీఫైనల్ దాకా దాకా వచ్చిన మహిళల హాకీ జట్టు కృషి తక్కువేమీ కాదు. పతకం ఖాయమనుకున్న షూటింగ్ ఈ సారి నిరాశపరిచింది. మిగతా క్రీడాంశాల్లో భారత్ సామర్థ్యం పేలవంగా ఉంది. ఓవరాల్‌గా చూసినప్పుడు 2012 లండన్ లో 6 పతకాల రికార్డును అధిగమించగలగడం సంతోషమే. అయినా పతకాల పట్టికలో మనం ఇంకా 48వ స్థానంలోనే ఉన్నాం. 1900 నుంచి ఒలింపిక్స్‌లో 24 సార్లు పాల్గొన్న భారత్ ఇప్పటివరకు 10 స్వర్ణాలు, 9 రజితాలు, 16 కాంస్యాలతో మొత్తం 35 పతకాలు సాధించింది. 1984 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌లో అడుగు పెట్టిన సోషలిస్టు చైనా అనతి కాలంలోనే అమెరికాకు దీటుగా ఎదిగింది. 2008లో 48 స్వర్ణాలతో నంబర్‌వన్‌గా నిలిచింది. కోటి 13 లక్షల జనాభా మాత్రమే కలిగిన చిన్ని సోషలిస్టు దేశం క్యూబా మనకన్నా అనేక రెట్లు మెరుగైన స్థితిలో ఉంది. అమెరికా ఆరు దశాబ్దాలుగా కొనసాగిస్తున్న ఆర్థిక దిగ్బంధనం నడుమ క్యూబా టోక్యోలో 7 స్వర్ణాలు, మూడు రజితాలు, 5 కాంస్యాలతో మొత్తం 15 పతకాలు సాధించి పతకాల పట్టికలో 13వ స్థానంలో నిలిచింది. ఒకప్పుడు సోవియట్ యూనియన్ ఒలింపిక్స్‌లో తిరుగులేని శక్తిగా నిలిచిన సంగతి తెలిసిందే. సోషలిస్టు దేశాలు ఇంతగా రాణించడానికి క్రీడలు ఆ దేశ సంస్కృతిలో ఒక భాగంగా మారడమే కారణం. చైనా క్రీడల అభివృద్ధికి తలసరి రూ. 6.10 పైసలు ఖర్చు చేస్తుంటే, భారత్ మూడు పైసలు మాత్రమే వెచ్చిస్తున్నది. నిధుల విషయంలోనే కాదు అధునాతన శిక్షణ, స్కూల్ స్థాయి నుంచే సిలబస్‌లో క్రీడలను ఒక భాగంగా చేర్చడం, పాఠశాలలు, గ్రామీణ ప్రాంతాల్లో అధునాతన వసతులతో కూడిన క్రీడా మైదానాలు వంటివి నెలకొల్పడంపై అవి ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నాయి. అంతర్జాతీయ పోటీల్లో రాటుదేలేందుకు క్రీడాకారులకు తగిన అవకాశాలు కల్పించడం, అన్ని క్రీడలను సమంగా ప్రోత్సహించడం చేస్తున్నాయి. వీటి నుంచి భారత్ పాఠాలు తీసుకోవాలి. ఒలింపిక్స్‌లో పతకాలు కొట్టినవారిలో అత్యధికులు గ్రామీణ స్థాయి నుంచి, దుర్భర పేదరికం నుంచి వచ్చినవారే. మీరాబాయి చాను, లవ్లీన్ ఎవరి నేపథ్యం చూసినా మనకు ఇదే కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా మహిళలు ఈ సారి అమోఘమైన పాత్ర నిర్వహించారు. వీరిని వెన్నుతట్టి ప్రోత్సహించాల్సింది పోయి మహిళా హకీ జట్టు సెమీస్‌లో ఓడిపోగానే వందన కటియా కుటుంబాన్ని అగ్రవర్ణాలకు చెందిన కొందరు కులం పేరుతో దూషించడం అత్యంత హేయమైన చర్య. కుల, మత విద్వేషాలను ఆటల్లో కూడా చొప్పించేందుకు యత్నించే ఇటువంటి ఉన్మాదానికి పాల్పడినవారిని ఎంతమాత్రం ఉపేక్షించరాదు. అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు బాచ్ పేర్కొన్నట్లు ప్రజల మధ్య ఐక్యతను పెంపొందించే శక్తి క్రీడలకే ఉంది. టోక్యోలో సాధించినదానితో సంతృప్తి చెందకుండా 'మరింత బలంగా, మరింత వేగంగా, మరింత ఉన్నతంగా' అన్న ఒలింపిక్ స్ఫూర్తిని ఆచరణలో పెట్టేందుకు భారత్ ఇంకా చాలా శ్రమించాల్సి ఉంది. క్రీడల అభివృద్ధికి సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించడం ప్రభుత్వం ముందున్న తక్షణ కర్తవ్యం. మరో మూడేళ్లలో జరిగే పారిస్ ఒలింపిక్స్‌లో పతకాల స్కోరును రెండంకెలు దాటించాలన్న లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఇప్పటి నుంచే ఆ దిశగా గట్టి చర్యలు చేపట్టాలి.










