Sep 22,2023 00:31

మాట్లాడుతున్న అప్పలరాజు

ప్రజాశక్తి-నక్కపల్లి:నక్కపల్లి ప్రాంతంలో బల్క్‌ డ్రగ్‌ యూనిట్స్‌ నెల కొల్పడానికి రాష్ట్ర మంత్రి వర్గం తీసుకున్న నిర్ణయం వెంటనే ఉప సంహరించుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం.అప్పలరాజు, మత్స్యకారులు డిమాండ్‌ చేశారు. మండలంలోని మత్స్యకార గ్రామమైన రాజయ్యపేటలో గురువారం సిపిఎం ఆధ్వర్యంలో మత్స్యకారులు బల్క్‌ డ్రగ్‌ యూనిట్స్‌ ఏర్పాటును వ్యతిరేకిస్తూ నిరసన తెలిపారు. బల్క్‌ డ్రగ్‌ యూనిట్స్‌ ఏర్పాటు వద్దే వద్దని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా అప్పలరాజు మాట్లా డుతూ, నక్కపల్లి మండలంలో వైజాగ్‌- చెన్నై ఇండిస్టీల్‌ కారిడార్‌ ఏర్పాటకు సేకరించిన భూములలో బల్క్‌ డ్రగ్‌ యూనిట్లు నెల కొల్పడానికి ఏపీ రాష్ట్ర మంత్రి వర్గం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అత్యంత ప్రమాదకరమైన, కాలుష్య కారకమైన ఈ బల్క్‌ డ్రగ్‌ యూనిట్లు కాకినాడ ఎస్‌ఇజెడ్‌ లో నెల కొల్పడాన్ని ఆ ప్రాంత మత్య్సకారులు, ప్రజలు వ్యతిరేకిస్తే, ఆ యూనిట్‌ లను నక్కపల్లి ప్రాంతంలో ఏర్పాటు చేయాలని చూడటం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ఈ ప్రాంత ప్రజలు వ్యతిరేకించరనా? లేక ఇక్కడ ప్రజలు ఏమైపోయినా పర్వాలేదనా అని ప్రభుత్వాన్ని నిలదీసారు. అభివృద్ధికి, పరిశ్రమల స్థాపనకు తాము వ్యతిరేకం కాదని, పర్యావరణానికి నష్టం కలిగించే, సముద్రాన్ని కలుషితం చేసే రసాయన తుల్య పరిశ్రమలు ఏర్పాటు చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.కారిడార్‌ పేరుతో సేకరించిన భూములలో పర్యావరణం, పచ్చదనం దెబ్బతినకుండా మత్స్యకారుల చేపలు వేటకు నష్టం కలగకుండా ఉండే విధంగా పరిశ్రమలు ఏర్పాటు చేసి ఈ ప్రాంత వాసులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు. ఇప్పటికే ఈ ప్రాంతంలో హెటిరో డ్రగ్స్‌ కంపెనీ వ్యర్ధ రసాయన జలాలు సముద్రంలోకి వదలడంత సముద్రం కలుషితమై మత్య సంపద నశించి పోవడంతో మత్స్యకారులు ఉపాధి కోల్పోయి పోయి పొట్ట చేత పట్టుకుని వలసలు పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎం.మహేష్‌ బాబు, కె.భూలోక, ఎం.నారాయణరావు, సిహెచ్‌ సోమేష్‌, వి.శ్రీనువాస్‌, పి.దావీద్‌రాజు పాల్గొన్నారు.