Sep 24,2023 00:42

నినాదాలు చేస్తున్న టిడిపి శ్రేణులు

ప్రజాశక్తి -నక్కపల్లి:ప్రాణాంతకరమైన బల్క్‌ డ్రగ్‌ యూనిట్లను నక్కపల్లి ప్రాంతంలో ఏర్పాటు చేస్తే అడ్డుకుంటామని తెలుగుదేశం పార్టీ మండల శాఖ అధ్యక్షులు కొప్పిశెట్టి వెంకటేష్‌, టిడిపి శ్రేణులు హెచ్చరించారు. టిడిపి శ్రేణులు శనివారం బల్క్‌ డ్రగ్‌ యూనిట్లను వ్యతిరేకిస్తూ నిరసన తెలిపారు. తహసీల్దార్‌ అంబేద్కర్‌ కు బల్క్‌ డ్రగ్‌ యూనిట్లు ఏర్పాటు చేయొద్దని కోరుతూ వినతిపత్రం అందజేసారు. ఈ సందర్భంగా వెంకటేష్‌ మాట్లాడుతూ, నక్కపల్లి ప్రాంతంలో సుమారు 2వేల ఎకరాల్లో ప్రమాదకర రసాయనాలను ఉత్పత్తి చేసే బల్క్‌ డ్రగ్‌ యూనిట్లను ఏర్పాటు చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తామంతా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు.బల్క్‌ డ్రగ్‌ యూనిట్‌ లను కాకినాడ ప్రాంత ప్రజలు వ్యతిరేకిస్తే నక్కపల్లి ప్రాంతంలో ఏర్పాటు చేయడానికి రాష్ట్ర క్యాబినెట్‌ ఆమోదించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. రసాయనతుల్య పరిశ్రమలను పల్లెల్లో ఏర్పాటు చేసి నాశనం చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఉపాధినిచ్చే కాలుష్య రహిత పరిశ్రమలకు తాము వ్యతిరేకం కాదని, ప్రజల ఆరోగ్యం ఉపాధిని దెబ్బతీసే రసాయన పరిశ్రమలను పూర్తిగా వ్యతిరేకిస్తామని స్పష్టం చేశారు.ఈ ప్రాంత ప్రజల అభిప్రాయాల్ని పరిగణనలోకి తీసుకోకుండా బల్క్‌ డ్రగ్‌ యూనిట్లు నెలకొల్పాలని చూస్తే ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు గింజాల లక్ష్మణరావు, అయినంపూడి అప్పలరాజు, పిక్కి సత్తియ్య, నానేపల్లి రాఘవ, ఏరిపిల్లి అప్పలరాజు, సూరకాసుల గోవింద్‌, సూరకాసుల పెదకాపు, అడ్డూరి లోవరాజు,పెద్దిరెడ్డి రమేష్‌, మీసాల బాబులు, కొప్పిశెట్టి వీరబాబు,పల్లా రాంబాబు, పల్లా నాగరాజు, అల్లాడ తాతారావు, పుణ్యమాంతుల బాబ్జి, గోపి పాల్గొన్నారు.