ఘనంగా మహాశివరాత్రి ఉత్సవాలు
పోటెత్తిన యాత్రికులు.. ఆలయాలు కిటకిట
ఇబ్బందులు లేకుండా అధికారుల ఏర్పాట్లు
ప్రజాశక్తి - ముసునూరు
మహాశివరాత్రిని పురస్కరించుకుని మండలంలోని బలివే గ్రామంలో ఉన్న శ్రీరామలింగేశ్వరస్వామి ఉత్సవాల్లో భాగంగా శనివారం కళ్యాణం రోజున సుమారు లక్ష మందికి పైగా భక్తులు వచ్చారని ఆలయ ఇఒ టి.విశ్వేశరరావు తెలిపారు. తెల్లవారుజమునా రెండు గంటల నుంచే తమ్మిలేరు స్నానాలు (జల్లు స్నానాలు) ఆచరించి అభిషేకాల కార్యక్రమాలకు అధిక సంఖ్యలో భక్తులు దర్శనార్థం విచ్చేశారు. నూజివీడు ఎంఎల్‌ఎ మేకా వెంకట ప్రతాప్ అప్పారావు, దెందులూరు ఎంఎల్‌ఎ అబ్బయ్య చౌదరి, మాజీ ఎంఎల్‌ఎ చింతమనేని ప్రభాకర్, రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, సర్పంచి రావు ప్రవీణ సుధాకర్ దర్శనం చేసుకున్నారు. డిఎస్‌పి ఇ.ఆశోక్‌కుమార్‌గౌడ్, సిఐ ఆర్.అంకబాబు, ఎస్‌ఐ ఎం.కుటుంబరావు పోలీస్ బందోబస్తు నిర్వహించారు. తహాశల్దార్ దాసరి సుధ, ఎంపి డిఒ జి.రాణి తమ సిబ్బందితో పాటు పర్వవేక్షణ చేపట్టి భక్తు లకు ఇబ్బందులు లేకుండా చూశారు. పలువురు ప్రసాదం, వాటర్‌ప్యాకెట్లు వితరణ చేశారు.
మండవల్లి : మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శివాలయాలు శనివారం భక్తులతో కిటకిటలాడాయి. పుష్కరానికి ఒకసారి మాత్రమే వచ్చే ఈ మహా శివరాత్రికి గొప్ప విశిష్టత ఉండడంతో ఎన్నడూ లేని విధంగా భక్తులు శివాలయాలకు చేరుకోవడంతో శివాలయాలు ఈ సంవత్సరం ప్రత్యేకత సంతరించుకున్నాయి. కమిటీ సభ్యులు అమర్చిన విద్యుత్ దీప కాంతులతో శివాలయాలు శోభాయమానంగా భక్తులకు కనువిందు చేశాయి. దీంతో మండవల్లి, పుట్టచెరువు, భైరవపట్నం, అగ్రహారం, చావలపాడులోని శివాలయాలకు భక్తులు పోటెత్తడంతో జన సందోహంతో శివాలయాలు నిండిపోయాయి. ఏలూరు రోడ్డులో ఉన్న కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి శివ కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. చావలపాడు సర్పంచి తలారి అన్నిబాబు, ధనలక్ష్మి దంపతులు పీటలపై కూర్చుని వివాహ కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం శనివారం ఉదయం నిర్వహించిన అన్న సమారాధన కార్యక్రమంలో వేల సంఖ్యలో భక్తులు పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీ కరించారు.
కైకలూరు : మహాశివరాత్రి సందర్భంగా మండలంలోని పలు గ్రామాల్లోని శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. మండలంలోని గోకర్ణపురంలోని శ్రీ గోకర్ణేశ్వరస్వామి, కైకలూరు శ్రీ శ్యామలాంబ అమ్మవారి ఆలయంలో ఉన్న రామేశ్వర, రామలింగేశ్వర స్వామి, ఆటపాకలోని శ్రీ కనకలింగేశ్వరస్వామి, పల్లేవాడలోని భీమేశ్వరస్వామి, ఆలపాడులోని సోమేశ్వర స్వామి, వర హపట్నం, భుజబలపట్నం, దొడ్డిపట్ల తదితర గ్రామాల్లోని ఆలయాల్లో విశేష పూజలు, అభిషేకాలు చేశారు.
గణపవరం : మహాశివరాత్రి వేడుకులు మండలంలో శనివారం ఘనంగా నిర్వహించారు. గణపవరం, సరిపల్లి, పిప్పర, మొయ్యేరు, జల్లికాకినాడ, ముప్పర్తిపాడు, కేశవరం పలు గ్రామాల్లో శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు దైవ దర్శనం చేసుకున్నారు. గణపవరం శివాలయం వద్ద భక్తులు బారులు తీరారు. ఆలయం వద్ద భక్తులకు అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసినట్లు ఆలయ ఛైర్మన్ కూసంపూడి రామకృష్ణంరాజు, ఇఒ శ్రీధర్ తెలిపారు.
తాడువాయి ఉత్సవాలకు యాత్రికుల రద్దీ
జంగారెడ్డిగూడెం : మండలంలోని తాడువాయిలో వైభవంగా నిర్వహిస్తున్న శివరాత్రి ఉత్సవాలకు యాత్రికులు వేల సంఖ్యలో తరలివచ్చారు. శనివారం మహాశివరాత్రి పండుగ నేపథ్యంలో తాడువాయి శివారులో పురాతన శివాలయానికి అధికసంఖ్యలో యాత్రికులు తరలి వచ్చారు. సుమారు పది వేల మంది యాత్రికులు ఉత్సవాలకు తరలి వచ్చారని ఉత్సవ నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. స్వచ్ఛంద సంస్థలు, ప్రజా సంఘాలు యాత్రికులకు తాగునీరు, మజ్జిగ పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేసి సేవలందించారు. మహాశివరాత్రి నేపథ్యంలో తాడువాయిలో ఐదు రోజులపాటు ఉత్సవాలు జరగనున్నాయి. ఈ క్రమంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.
వాహన రాకపోకలకు అంతరాయం
తాడువాయిలో జరుగుతున్న మహాశివరాత్రి ఉత్సవాలకు వందల సంఖ్యలో వాహనాలు తరలివచ్చాయి. ఆలయానికి దగ్గరలో వాహనాలు అధిక సంఖ్యలో చేరడం వల్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడిందని పలువురు పేర్కొం టున్నారు. ఆలయ సమీపానికి రాకముందే వాహ నాల రద్దీని నియంత్రించాలని యాత్రికులు కోరుతున్నారు.
డివైఎఫ్‌ఐ, వ్యకాస ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ
మహాశివరాత్రి సందర్భంగా డివైఎఫ్‌ఐ, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో యాత్రికులకు ఉచితంగా మజ్జిగ, తాగునీటిని అందించడం అభినందనీయమని డివైఎఫ్‌ఐ పూర్వ నాయకులు పసల సూర్యారావు అన్నారు. శనివారం మండలంలోని తాడువాయి శివరాత్రి ఉత్సవాల నేపథ్యంలో పటాన్ మస్తాన్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఉచిత మజ్జిగ, తాగు నీరు పంపిణీ కేంద్రాన్ని డివైఎఫ్‌ఐ పుర్వ నాయకులు పసల సూర్యారావు ప్రారంభించారు. ఆనంతరం డివైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి జి.సూర్యకిరణ్ మాట్లాడుతూ తాడువాయిలో జరుగుతున్న భద్రకాళీ సమేత విశ్వేశ్వర స్వామి శివరాత్రి కల్యాణ మహోత్సవానికి తరలి వస్తున్న వేలాది మంది యాత్రికులకు డివైఎఫ్‌ఐ, వ్యవసాయ కార్మిక సంఘం సంయుక్త ఆధ్వర్యంలో ఉచితంగా మజ్జిగ పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఉత్సవాలు నిర్వహించే ఐదు రోజులు ఈ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. అధికారులు స్పందించి ప్రధాన రహదారి నుండి ఆలయ ప్రాంగణం వరకు కనీసం మూడు చోట్ల చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం, డివైఎఫ్‌ఐ నాయకులు పాల్గొన్నారు.
కలిదిండి : స్థానిక పార్వతీ సమేత పాతాళ భోగేశ్వరాలయానికి భక్తులు పోటెత్తారు. కైకలూరు నియోజకవర్గ ఎంఎల్‌ఎ దూలం నాగేశ్వరరావు దంపతులకు ఆలయ ఇఒ శింగనపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అర్చకులు ఘన స్వాగతం పలికారు. కైకలూరు చిన్నారుల కూచిపూడి భరతనాట్యం, సానా రుద్రవరం, కలిదిండి శ్రీ వాసవీ మహిళా, ఏలూరుపాడు శ్రీ లలితా మహిళా కోలాట బృందం చేసిన మురళీ కోలాటం యాత్రికులను ఆకట్టుకు న్నాయి. లోడిదలంక, నెహ్రూ నగర్, అంజనాపురం, పడమటి పాలెం, గొల్లగూడెం గ్రామాల నుంచి ప్రభలు డప్పు వాయిద్యాలు, యువత నృత్యాల నడుమ ఆలయానికి తరలి వెళ్లాయి. ఆలయ ప్రాంగణంలో అన్నదాన సత్రాలు ఏర్పాటు చేశారు. ఎస్‌ఐ మణి కుమార్ ట్రాఫిక్‌కి ఎటువంటి అంతరాయం లేకుండా, ఆలయ ఇఒ శింగనపల్లి శ్రీనివాసరావు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా పర్యవేక్షించారు. మాజీ ఎంఎల్‌ఎ జయమంగళ వెంకటరమణ, కలిదిండి సర్పంచి మారుతీ ప్రసన్న స్వామివారిని దర్శించుకున్నారు.
చాట్రాయి : మండల కేంద్రమైన చాట్రాయిలో ప్రసిద్ధి చెందిన ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయానికి శనివారం వేలాది మంది యాత్రికులు తరలివచ్చారు. ఆలయ కమిటీ ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.










