కనీస వేతనాలపై మోడీ సర్కార్ మరోమారు కష్టజీవులపై దాడికి తెగబడుతోంది. కోవిడ్ కష్టకాలంలో జీవనోపాధి కోల్పోయి 'బతుకు జీవుడా...' అని కాలం వెళ్లబుచ్చుతున్న నేపథ్యంలో ప్రజల ఆదాయాలు పెంచే చర్యలు చేపట్టాల్సిందిపోయి వాటిని కుదించేందుకు కంకణం కట్టుకోవడం దుర్మార్గం. కనీస వేతనాలు, జాతీయ స్థాయి కనీస వేతనాల స్థిరీకరణపై సాంకేతిక ప్రతిపాదనలు, సిఫార్సులు అందించేందుకు ఈ నెల 3న కేంద్రం ఒక నిపుణుల కమిటీ ఏర్పాటు చేయడం కచ్చితంగా కార్మికులకు ద్రోహం చేయడమే. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ డైరెక్టర్ ప్రొఫెసర్ అజిత్ మిశ్రా అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఈ కమిటీ కాల వ్యవధిని మూడేళ్ల సుదీర్ఘకాలం నిర్ణయించడంలోనే కనీస వేతన హక్కును కాలరాసే కుట్ర కనిపిస్తుంది. పాత నిపుణుల కమిటీ 2019లో చేసిన ప్రతిపాదనలను అటకెక్కించారు. ఇక కొత్త నిపుణుల కమిటీ మూడేళ్ల దాకా నివేదిక ఇవ్వదు. మరి కనీస వేతనాల సవరణ ఎప్పుడు? కార్పొరేట్ కంపెనీలకు కారు చౌకగా లేబర్ మార్కెట్‌ను సృష్టించి 'ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' ర్యాంకుల్లో అగ్రభాగాన నిలుద్దామనే వెంపర్లాట తప్ప కార్మికుల కష్టాలు పట్టడం లేదు.
2018 జనవరి 17న వి.వి.గిరి నేషనల్ లేబర్ ఇన్‌స్టిట్యూట్ ఫెలో డాక్టర్ అనూప్ శతపథి అధ్యక్షతన కేంద్ర ప్రభుత్వం మిశ్రా తరహా లోనే ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. 2019లో ఈ కమిటీ సమగ్ర నివేదిక అందజేసింది. జాతీయ స్థాయిలో రోజుకు రూ.375 కనీస వేతనాన్ని, నెలకు రూ.9,750 వేతనాన్ని ఇవ్వవచ్చని ప్రతిపాదించింది. దేశంలోని అయిదు రీజియన్లకు గాను ప్రాంతాల వారీ వేతనాలను స్థిరపర్చాలని కూడా పేర్కొంది. అయితే ఏడవ పే కమిషన్ సిఫార్సు చేసిన వేతన రేట్ల ప్రకారం జాతీయ స్థాయిలో రోజుకు రూ.600 కనీస వేతనాన్ని కల్పించాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ దశలోనే కేంద్ర ప్రభుత్వం 2019లో రోజువారీ కనీస వేతనాన్ని రూ.178 కనిష్టంగా నిర్ణయించింది. ఈ సంక్లిష్టత ఇలా ఉండగానే కార్మిక చట్టాలన్నిటిని గంపగుత్తగా రద్దు చేసి వాటి స్థానంలో నాలుగు దుర్మార్గమైన లేబర్ కోడ్‌లను కేంద్రం తీసుకొచ్చింది. తీవ్రమైన ప్రజా వ్యతిరేకత వ్యక్తమౌతున్నా, ఆ కోడ్‌లను అమలు జరిపి తీరుతామని ఇటీవలే కేంద్ర మంత్రి ప్రకటించారు.
జాతీయ కనీస వేతనం అనేది ప్రధానంగా కార్మికులు పేదరికంలోకి దిగజారకుండా చూడడం కోసం ముందుకు తెచ్చిన భావన. ఆదాయాలలో, లేబర్ మార్కెట్‌లో ఉండే వ్యత్యాసాన్ని తగ్గించడం మరో లక్ష్యం. కార్మికుల, వారి కుటుంబాల అవసరాన్ని, ద్రవ్యోల్బణాన్ని దష్టిలో ఉంచుకుని ఈ కనీస వేతనం నిర్ధారించాల్సి వుంటుంది. వేతనాలు పెరిగితే కొనుగోలు శక్తి పెరుగుతుందని, ఉత్పత్తి పెరిగి ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తద్వారా అందరికీ వర్తించే అభివద్ధి సాధ్యం అవుతుందనేది ఆర్థిక నిపుణుల మాట. అటు ఆర్థిక సంక్షోభం ముదరడం, దానికి కరోనా విపత్తు తోడవడం వలన దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థ తిరిగి వృద్ధిబాట పట్టాలంటే ఆదాయాల పెంపు అవశ్యం. కాని అటు కేంద్రం కానీ, ఇటు రాష్ట్రం కానీ ఈ మాటలు చెవికెక్కించుకోవడం లేదు. కనీస వేతనాలను మరింత కుదించడానికే పూనుకుంటున్నారు. 2014లో రూ.14,000గా కనీస వేతనాన్ని రూ.21,000కు పెంచాలని పే కమిషన్ సిఫార్సు చేస్తే దానిని ఏకంగా రూ.9750కి కుదించాలనుకోవడం దుర్మార్గమే కాదు, మన ఆర్థిక వ్యవస్థ మరింత దిగజారడానికీ ఇది దారితీస్తుంది. సంక్షేమం గాలికి ఎగిరిపోతుంది. వృద్ధి పాతాళానికి పరుగులెడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా కనీస వేతన విషయంలో మోడీ సర్కార్‌నే అనుసరిస్తోంది. గతంలో టిడిపి ప్రభుత్వం కూడా కనీస వేతనం ఊసెత్తలేదు. ఇప్పుడు కరోనా కాలంలో ఫ్రంట్‌లైన్ వారియర్లుగా ఎనలేని సేవ చేస్తున్న వైద్య సిబ్బంది నిరసనతోనే విధులు నిర్వహిస్తున్నా వైసిపి ప్రభుత్వం చేష్టలుడిగినట్లు నటిస్తోంది. అధికారం చేపట్టి రెండేళ్లయినా ఇంకా కనీస వేతన కమిటీని నియమించలేదు. 73 రకాల కనీస వేతనాలలో 68 తరహాల కార్మికులకు 2005-06 తర్వాత వేతన పునర్నిర్ణయం జరగలేదంటే ఎంత అన్యాయం! దేశంలోనూ, ఇటు రాష్ట్రంలోనూ కార్మికలోకం కనీస వేతనం కోసం పోరాడని రోజంటూ లేదు. కార్పొరేట్ల సేవలో మునిగిన కేంద్రం, సంక్షేమ పథకాల మాటున కార్మికుల పట్ల బాధ్యతను విస్మరించిన రాష్ట్రం తమ వైఖరులు మార్చుకునే వరకూ కార్మికలోకం పోరాడాల్సిన సమయం ఇది. కార్పొరేట్ల లాభాల కోసం కార్మికుల్ని బలిపశువులు కానివ్వరాదు.










