Nov 05,2022 23:55

మాట్లాడుతున్న ప్రశాంత్‌కుమార్‌

ఎపి జెన్‌కో ఎస్‌ఇ ప్రశాంత్‌ కుమార్‌
ప్రజాశక్తి -సీలేరు :
ఆంధ్ర ఒరిస్సా ఉమ్మడి నిర్వహణలో ఉన్న బలిమెల జలాశయం నుంచి 4000 క్యూసెక్కుల నీటిని తీసుకుంటున్నామని ఏపీ జెన్కో ఎస్‌ఈ సివిల్‌ కెకెవి ప్రశాంత్‌ కుమార్‌ వెల్లడించారు. శనివారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ సీలేరు కాంప్లెక్స్‌ డొంకరాయి జలాశయంలో ప్రస్తుతం ఇన్‌ ఫ్లో తక్కువగా ఉండడంతో బలిమెల జలాశయలో 2000 క్యూసెక్కుల నుంచి 4000 పెంచామని తెలిపారు. సీలేరు కాంప్లెక్స్‌ పరిధిలో జలాశయాలు నీటి నిల్వలు తక్కువగా ఉండడంతో గోదావరి డెల్టా రబి పంటకు విద్యుత్‌ ఉత్పత్తి అనంతరం మాత్రమే నీటి విడుదల చేయడం సాధ్యపడుతుందని చెప్పారు. విద్యుత్‌ ఉత్పత్తి లేకుండా నేరుగా గోదావరి డెల్టాకి నీటిని విడుదల చేస్తే రానున్న వేసవికాలంలో సీలేరు కాంప్లెక్స్‌లో జల విద్యుత్‌ కేంద్రాలకు నీటి సమస్య తప్పదని వెల్లడించారు. ప్రస్తుతం బలిమెల జలాశయంలో ఆంధ్ర వాట కలుపుకొని ప్రస్తుతం 44.1591 టీఎంసీలు నీటి నిల్వలు ఉన్నాయని తెలిపారు. ఈ నీటిని వచ్చే ఏడాది జూన్‌ నెల ఆఖరి వరకు పొదుపుగా వాడుకుంటే సీలేరు కాంప్లెక్స్‌లో జల విద్యుత్‌ కేంద్రాలకు నీటి సమస్య తలెత్తదని పేర్కొన్నారు. గోదావరి రివర్‌ బోర్డు ఇరిగేషన్‌ అధికారులు నీటి నిల్వల వివరాలు కోరారని తెలిపారు. రానున్న రోజుల్లో గోదావరి డెల్టా రబీ పంటకు ఏపీ జెన్కో ఉన్నతాధికారి ఆదేశాలకు అనుగుణంగా నీటి విడుదల చేస్తామని చెప్పారు.