Nov 19,2022 23:31

సమీక్షా సమావేశంలో పాల్గొన్న ఆంధ్రా, ఒడిశా అధికారులు

ప్రజాశక్తి-సీలేరు
ఆంధ్ర-ఒడిశా ఉమ్మడి నిర్వహణలో ఉన్న బలిమెల జలాశయం నీటి వినియోగంపై మల్కనగిరి జిల్లా చీఫ్‌ కన్స్ట్రక్షన్‌ ఇంజనీర్‌ పొట్టేరు ఇరిగేషన్‌ కార్యాలయంలో శనివారం సమీక్ష సమావేశాన్ని ఇరు రాష్ట్ర అధికారులు నిర్వహించారు. 2022-23 సంవత్సరంలో జులై నుంచి అక్టోబర్‌ చివరి నాటికి ఏయే రాష్ట్రాలు ఎంతెంత నీటిని వినియోగించుకున్నారో లెక్కలు తేల్చారు. అక్టోబర్‌ చివరినాటికి ఆంధ్ర తన వాటాగా 12.0846 టీఎంసీలు, 2021-22 నీటి సంవత్సరంలో అధికంగా వినియోగించుకున్న 5.8765 టీఎంసీలతో కలిపి వినియోగించుకున్నట్లు, ఒడిశా 20.7044 టీఎంసీలు నీటిని వినియోగించుకున్నట్లు ఇరు రాష్ట్ర అధికారులు లెక్కలు తేల్చారు. దీని ప్రకారం ఒడిశా, ఆంధ్ర కంటే 8.6198 టీఎంసీలు నీటిని అధికంగా వినియోగించుకున్నట్లు ధ్రువీకరించారు. ప్రస్తుతం బలిమెల, జోలాపుట్‌ జలాశయాల్లో మొత్తం 65.9537 నీటి నిల్వలు ఉన్నాయని, ఇందులో ఆంధ్ర వాటా 37.2868 టీఎంసీలుగాను, ఒడిశా వాటా 28.6669 టీఎంసీలుగా అధికారులు నిర్ణయించారు. బలిమెల జలాశయంలో ఉన్న నీటిని ప్రస్తుత అవసరాల మేరకు ఈ రాష్ట్రాలు బలిమెల జలాశయం నుంచి 1000 క్యూసెక్కులు నీటిని వినియోగించుకోవడానికి అంగీకారం కుదుర్చుకున్నారు. ఈ సమావేశంలో ఒడిశా తరపున చీఫ్‌ కన్స్ట్రక్షన్‌ ఇంజనీర్‌ సివిల్‌ చంద్రశేఖర్‌ మిశ్రా, బలిమెల హైడ్రో కార్పొరేషన్‌ జనరల్‌ మేనేజర్‌ బి.నారాయణ పాత్య, జనరల్‌ మేనేజర్‌ జ్యోతిర్మయ దాస్‌, ఏపీ జెన్కో సీలేరు కాంప్లెక్స్‌ ముఖ్య ఇంజనీర్‌ కెకెవి.ప్రశాంత్‌ కుమార్‌, ఈఈ జాకీ హుస్సేన్‌, డాం అండ్‌ పవర్‌ హౌస్‌ ఎడిఈ ఎం.లక్ష్మీనారాయణ, ఏడిఏ క్యాంప్‌ అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.