Nov 09,2023 22:02

ఖాళీ బిందెలతో నిరసన తెలుపుతున్న మహిళలు

బలిజిపేట: మండల కేంద్రమైన బలిజిపేట మెట్టవీధిలో ప్రజలు దాహం కేకలు పెడుతున్నారు. తమ సమస్యలపై పలుమార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోనందుకు నిరసనగా గురువారం వారు ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. అనంతరం మహిళలు మాట్లాడుతూ స్థానిక పంచాయతీ కార్యదర్శి, స్థానిక నాయకులకు తాగునీటి అవస్థలపై ఎన్నిసార్లు విన్న మించామని, మా గోడు వినే పరిస్థితి లేదని తెలిపారు. గతంలో జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల నుండి తాగడానికి మంచినీరు తెచ్చుకునే వారమని, కాస్త దూరమైనా కాలినడకన వెళ్లి మంచినీళ్లు తెచ్చుకునే పరిస్థితి ఉందనే, కానీ నేడు ఆ బోరు అక్కడ లేకుండా చేశారని వాపోయారు. దీంతో అక్కడ నుంచి నీళ్లు తెచ్చుకోవడానికి లేకపోవడంతో ఇబ్బందిగా ఉందని వారు వాపోయారు. ఇంటింటా కొళాయి కార్యక్రమం పేరుతో ఇంటిముందు దిష్టిబొమ్మల్లా కొళాయిలను ఏర్పాటు చేసినా, నేటి వరకు వాటి ద్వారా తాగునీటి సదుపాయం కల్పించకపోవడం దారుణమన్నారు. నెల రోజులుగా మంచినీరు తాగడానికి లేదని అధికారులకు, నాయకులకు విన్నవించినా పట్టించుకోకపోవడం దారుణమని మహిళలు ఆందోళన వ్యక్తం చేశారు. సిపిఎం నాయకులు వై.మన్మధరావు మాట్లాడుతూ ప్రభుత్వం, అధికారులు ఎంతో ఆర్భాటంగా ఇంటింటి కొళాయిలు వేశారని, దీంతో నిరంతరం తాగునీళువస్తాయని ఆశపడ్డ ప్రజలు నిరాశే మిగిలిందన్నారు. అధికారులు, నాయకులు ప్రచార ఆర్భాటం తప్ప ప్రజలకు ఉపయోగలేదని అన్నారు. ఇప్పటికైనా తాగడానికి నీళ్లు ఇవ్వాలని మెట్ట వీధి మహిళలు ఆవేదన పాలకులు అర్థం చేసుకోవాలని కోరారు. ఈ నిరసనలో పెద్దఎత్తున మహిళలు పాల్గొన్నారు.