
ప్రజాశక్తి-నర్సీపట్నంటౌన్:మున్సిపాలిటీలోని బలి ఘట్టంలో జరిగిన గొడవలకు సంబంధించి నర్సీపట్నం పట్టణ పోలీస్ స్టేషన్లో నమోదైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుకు సంబంధించి డిఎస్పి కే ప్రవీణ్ కుమార్ శనివారం విచారణ చేపట్టారు. మున్సిపాలిటీలోని బలిఘట్టంలో ఈనెల మూడు, నాలుగు తేదీల్లో జరిగిన మరిడిమాంబ ఉత్సవంలో పెద్ద జాగారంలో గొడవలకు సంబంధించి రెండు కేసులను పట్టణ పోలీసులు నమోదు చేశారు. శనివారం బలిఘట్టం ఎస్సీ కాలనీ కమ్యూనిటీ హాల్ వద్ద జరిగిన విచారణలో ఆరుగురు బాధితులు, ప్రత్యక్ష సాక్షుల నుంచి సమగ్ర సమాచారాన్ని డి.ఎస్.పి ప్రవీణ్ కుమార్ సేకరించారు. విచారణ కొనసాగుతుందని డిఎస్పి ప్రవీణ్ కుమార్ విలేకరులకు వెల్లడించారు. కాగా బాధితులకు న్యాయం చేయాలని దళిత సంఘాల నాయకులు చైతన్య, నేతల నాగేశ్వరరావు, అల్లంపల్లి ఈశ్వరరావు పోలీసు అధికారులను కోరారు. డీఎస్పీ వెంట పట్టణ సీఐ నమ్మి గణేష్, ఎస్సై జి,గోవిందరావు, తదితరులు ఉన్నారు.