ప్రజాశక్తి-కాజులూరు బడుగు బలహీన వర్గాలకు నీడ కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని బిసి సంక్షేమం, సమాచార పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అన్నారు. ఆదివారం కాజులూరు మండలం, శెలపాక గ్రామంలో నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు కార్యక్రమం కింద గొల్లపాలెం, శెలపాక, తనుకువాడ, మతుకుమిల్లి, బందనపూడి గ్రామాలకు చెందిన 436 మందికి ఇళ్ల పట్టాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ గొప్ప హదయం ఉన్న ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెట్టి, అమలు చేస్తున్న నవరత్నాలు-పేదలందరికీ ఇళ్ల పథకం కింద మహిళలకు రూ.10 లక్షల విలువ చేసే ఆస్తి చేతికి అందిందని పేర్కొన్నారు. పేదవాడిని సొంత ఇంటిలో ఉంచాలనే గొప్ప లక్ష్యంతో ముఖ్యమంత్రి నవరత్నాలు- పేదలందరికీ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తున్నారని వివరించారు. రామచంద్రపురం నియోజకవర్గంలో 15 వేల మందికి సొంతింటి కలను సాకారం చేస్తున్నందుకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చి అవినీతిరహితంగా, అత్యంత పారదర్శకంగా పథకాలను లబ్ధిదారులకు అందజేస్తున్నారని తెలిపారు. కరోనా సమయంలో వాలంటీర్లు చేసిన సేవ మరువలేనిదన్నారు. జబ్బు చేస్తే డబ్బు కోసం బాధపడాల్సిన అవసరం లేకుండా డాక్టర్ వైఎస్‌ఆర్ ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేస్తున్నారని తెలిపారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గొప్ప చదువు ద్వారా ప్రపంచ మేధావిగా గుర్తింపు సాధించారని, అందుకే పేదల పిల్లలు బాగా చదువుకోవాలనే ఉద్దేశంతో విద్యారంగంలో అనేక పథకాలను ప్రవేశపెట్టి రాష్ట్ర ప్రభుత్వం విజయవంతంగా అమలు చేస్తోందని వివరించారు. జగనన్న విద్యా కానుక, జగనన్న అమ్మఒడి, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన వంటి పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. పేదల పిల్లలకు ఇంగ్లీష్ మీడియం విద్యను దగ్గరకు చేర్చారని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల కోసం ఎవరూ ఎక్కడికీ తిరగాల్సిన అవసరం లేకుండానే నేరుగా ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా పథకాల ఫలాలను అందిస్తున్నారని తెలిపారు. కోట్లాది రూపాయలు ఖర్చు చేసి ప్రైవేటు భూమిని మార్కెట్ ధరకు కొనుగోలు చేసి నవరత్నాలు- ప్రజలందరికీ ఇళ్ల పథకం కింద పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చిన ఘనత ఈ ప్రభుత్వానిదని పేర్కొన్నారు. నవరత్నాలు ప్రజలందరికీ ఇళ్ల లేఔట్లలో సరికొత్త ఊళ్లు సాక్షాత్కారం కానున్నాయని మంత్రి పేర్కొన్నారు. అందరూ సుఖసంతోషాలతో ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నట్లు మంత్రి వేణుగోపాల కష్ణ అన్నారు. కార్యక్రమంలో ఎంపిపి మాతా భారతి, జెడ్‌పిటిసి సభ్యుడు వనుం వెంకట సుబ్బారావు, తహశీల్దారు బి.సాయి సత్యనారాయణ, శలపాక గొల్లపాలెం, తణుకువాడ గ్రామ సర్పంచులు పోతుల గనిరాజు, పోతురాజు మౌనిక, నరాల సుబ్బరాజు మండల బిసి సెల్ కన్వీనర్ గుబ్బల యేసు రాజు, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. తొలుత ఇటీవల మరణించిన తాళ్ళరేవు మాజీ ఎంఎల్‌ఎ దొమ్మేటి వెంకటేశ్వర్లుకు మంత్రి, ప్రజాప్రతినిధులు ఘన నివాళి అర్పించారు.










