ప్రజాశక్తి-అనకాపల్లి
బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి వైసిపి ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర పరిశ్రమలు ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. జీవీఎంసీ 84వ వార్డులో శుక్రవారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సరిసావారి వీధిలో రూ.11.50 లక్షలతో నిర్మించిన సిసి రోడ్లు, డ్రైనేజీలను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిపక్షాలు లేనిపోని తప్పుడు ఆరోపణలు, ప్రచారాలు చేస్తున్నాయని, వాటిని ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ పలక యశోద రవి, కార్పొరేటర్ మాదంశెట్టి చిన్నతల్లి నీలబాబు, జోనల్ కమిషనర్ కనకమహాలక్ష్మి, వైసిపి రాష్ట్ర కార్యదర్శి దిలీప్ కుమార్, నాయకులు మందపాటి జానకి రామరాజు, మల్ల బుల్లిబాబు, జాజుల రమేష్, కొణతాల మురళీకృష్ణ, కోరుకొండ రాఘవ, రమేష్, సకల గోవిందు తదితరులు పాల్గొన్నారు.
అచ్యుతాపురం : మండలంలోని తంతడి సచివాలయం పరిధి దాసరపాలెం, అంగవానిపాలెం, పైలవానిపురం, రాజన్నపాలెం గ్రామాల్లో శుక్రవారం ఎలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబురాజు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం చేపట్టారు. గ్రామస్తులతో మాట్లాడి ప్రభుత్వ పథకాలు అందుతున్న తీరుపై ఆరా తీశారు. టిడిపి రాష్ట్ర కార్యదర్శి రాజాన రమేష్ కుమార్ తల్లి అనారోగ్యంతో మంచాన పడి ఉండగా, ఆమెను ఎమ్మెల్యే కన్నబాబు రాజు స్వయంగా వెళ్లి పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. మార్టూరు గ్రామానికి చెందిన రాయి ఉమామహేశ్వరికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వచ్చిన రూ.90వేలు చెక్కును వారి కుటుంబీకులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి మాజీ చైర్మన్ యు సుకుమార వర్మ, వైసిపి మండల అధ్యక్షులు దేశంశెట్టి శంకర్రావు, తంతడి ఎంపీటీసీ సభ్యురాలు రాజాన పద్మావతి అప్పారావు, కె.విమలా నాయుడు, మోటూరు సంజీవి, రాజన్న నానాజీ, కేకే రమేష్ బాబు పాల్గొన్నారు.










