Oct 31,2022 23:57

మాట్లాడుతున్న కలెక్టర్‌ సస

ప్రజాశక్తి -పాడేరు: పిఎంజిఎస్‌వై, ఎల్‌డబ్ల్యుఇఎ ఆర్‌సిపి పధకాల కింద మంజూరైన పనులను సకాలంలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ ఆదేశించారు. సోమవారం ప్రాజెక్ట్‌ ఇంప్లిమెంటేషన్‌ యూనిట్‌ ఆద్వర్యంలో చేపట్టిన పనుల ప్రగతిని జిల్లా కలెక్టర్‌ తన చాంబర్‌లో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, సకాలంలో పనులు పూర్తి చేయని, పనులపై స్పందించని కాంట్రాక్టర్లను బ్లాక్‌ లిస్టులో పెట్టాలని, వారికి పెనాల్టీలు విధించాలని ఆదేశించారు. జిల్లాకు పిఎంజిఎస్‌వై, ఎల్‌డబ్ల్యుఇఎ ఆర్‌సిపి పధకాల కింద 73 పనులు మంజూరు అయ్యాయని, అందులో 17 పనులు పూర్తి కాగా 41 పనులు వివిధ స్థాయిలలో ప్రగతిలో ఉన్నాయని కలెక్టర్‌ తెలిపారు. ఆరు పనులకు సంబంధించి కొంత భాగం అటవీ ప్రాంతంలో ఉన్నందున అవసరమైన మంజూరులు పొందాల న్నారు. మిగిలిన తొమ్మిది పనులు పూర్తిగా అటవీ క్లియరెన్సీ తీసుకోవలసి ఉన్నందున తగు ప్రతిపాదనలు పొంది త్వరగా అనుమతులు పొందాలని ఆదేశించారు. ప్రతి పనికి సంబంధించి ఆయా డిఇఇ, ఎఇఇలతో చర్చించిన కలెక్టర్‌ సంబంధిత ప్రతి కాంట్రాక్టర్‌ను పిలిచి వ్యక్తిగతంగా చర్చించి తగు సూచనలు జారీ చేసారు. అందుబాటులో లేని కాంట్రాక్టర్లకు ఫోన్‌ చేసి పనుల పూర్తికి సమయాన్ని నిర్దేశించారు. అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని, పనులు ఆలస్యమైతే సహించేది లేదని హెచ్చరించారు. పని పూర్తి చేసిన వెంటనే బిల్లుల చెల్లింపునకు చర్యలు తీసుకుంటామని తెలిపిన కలెక్టర్‌ ముఖ్య కార్యదర్శికి సైతం ఫోన్‌ చేసి నిధుల మంజూరుకు హామీ పొందారు. ఇప్పటికే గత 15 రోజులుగా వర్షాలు ఆగినా పనులు ప్రారంభించక పోవటం పట్ల కలెక్టర్‌ అసంతీప్తి వ్యక్త పరిచారు. వర్షాలతో ఆగిన పనులు ఒక వారం లోపు తిరిగి ప్రారంభించకపోతే కాంట్రాక్టు రద్దు చేస్తామని హెచ్చరించారు. పనులను ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తామని తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రోడ్లు, వంతెనల పనులు సకాలంలో నాణ్యవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమీక్షలో పిఐయు కార్య నిర్వాహక ఇంజనీర్‌ కే.లావణ్య కుమార్‌, డిఇఇలు పి మధు, బి.రవికుమార్‌, ఐ.కళ్యాణ్‌, ఈశ్వరరావు, ఎఇఇలు, కాంట్రాక్టర్లు శేషారెడ్డి, పేరా రెడ్డి, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.