రాయచోటి : బక్రీద్ పండుగను మత సామరస్యంతో ప్రశాంత వాతావరణం, చట్టానికి లోబడి పండుగను జరుపుకోవాలని కలెక్టర్ గిరీష అన్నారు. ఈ నెల 29 నుండి ప్రారంభమయ్యే బక్రీద్ పండుగను పురస్కరించుకుని శుక్రవారం కలెక్టరేట్లోని స్పందన హాలులో ఎస్‌పి గంగాధర్‌రావుతో కలిసి వివిధ శాఖల అధికారులు, అన్ని మతాల పెద్దలతో కలెక్టర్ అధ్యక్షతన జిల్లా మత సామరస్య కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అన్నమయ్య జిల్లా మత సామరస్యానికి ప్రతీక అని, అందరి సహకారం వల్లనే ఇది సాధ్యమైందని, ఇలాంటి సహకారాన్ని ఇలాగే కొనసాగించాలని కోరారు. బక్రీద్ పండుగను ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలుగ చేయకుండా సంతోషంగా జరుపుకోవాలన్నారు. సామాజిక మాధ్యమాలలో వచ్చే వార్తలపై అప్రమత్తంగా ఉండాలని, ఏ చిన్న సున్నితమైన సమస్య వచ్చినా వెంటనే పోలీస్, రెవెన్యూ శాఖలకు తెలియజేయాలని కలెక్టర్ సూచించారు. క్రితం ఏడాది లాగానే ఈసారి కూడా అందరూ సంతోషంగా పండుగ జరుపుకునే విధంగా అవగాహన కల్పించాలని, ఎక్కడ ఎలాంటి సమస్యలు రాకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. తాత్కాలిక జంతు వధశాలలు ఏర్పాటు చేయాలని, ప్రత్యేక పారిశుద్ధ్యం అలాగే అవసరమైన నీటి సౌకర్యం ఏర్పాటు చేయాలని, వేస్ట్ ను దూరంగా జాగ్రత్తగా డిస్పోజ్ చేయాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం కోవిడ్ పూర్తిస్థాయిలో లేకున్నా కోవిడ్ నియమ నిబంధనలు తప్పక పాటించాలని పేర్కొన్నారు. సామాజిక దూరం, శానిటేషన్, మాస్క్ ధరించాలన్నారు. ముఖ్యంగా స్లాటర్ హౌస్ వద్ద గుంపులు గుంపులుగా ఉండరాదన్నారు. బక్రీద్ పండుగను ప్రశాంతంగా శాంతియుతంగా భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని, మత సామరస్య కమిటి సభ్యులు కూడా తమ వంతు సహకారం అందించాలని పేర్కొన్నారు. ఎస్‌పి గంగాధర్‌రావు మాట్లాడుతూ బక్రీదు పండుగ సందఠంగా అన్ని మతాల వారు పరస్పరం సహకరించుకొని సోదర భావంతో పండుగను జరుపుకోవాలన్నారు. బక్రీద్ పండుగ సందర్భంగా ఎక్కడ ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా అన్ని భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఏదైనా సమస్యలు ఉంటే తమ దష్టికి తీసుకురావాలని కోరారు. అవసరమైన చోట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. బక్రీద్ పండుగను ఇతరులకు ఎవరికీ ఎలాంటి ఇబ్బంది కలుగకుండా సంతోషంగా జరుపుకోవాలన్నారు. సమావేశంలో డిఆర్‌ఒ సత్యనారాయణ, ఆర్‌డిఒ రంగస్వామి, మున్సిపల్ కమిషనర్ గంగాప్రసాద్, జిల్లా అధికారులు, కమిటీ సభ్యులు, వివిధ మత పెద్దలు పాల్గొన్నారు.
మదనపల్లె అర్బన్: ఆత్మీయత ఆదరణకు ప్రతీక, త్యాగానికి అద్దం పట్టే బక్రీదు పండుగను ముస్లిం సోదరులు ప్రశాంత వాతావరణంలో సాంప్రదాయ బద్ధంగా జరుపుకోవాలని డిఎస్‌పి కె.కేశప్ప పేర్కొన్నారు. శుక్రవారం డిఎస్‌పి కార్యాలయంలో సబ్ డివిజనల్ పీస్ కమిటీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించి బక్రీదు పండుగకు సంబంధించి పలు సూచనలు సలహాలు అందజేశారు. సమావేశంలో మదనపల్లి టూ టౌన్ సిఐ మురళీకృష్ణ, వన్ టౌన్ సిఐ మహబూబ్ బాషా, తాలూకా సిఐ సత్యనారాయణ, ఎస్‌ఐలు సుబ్బారెడ్డి, హరిహరప్రసాద్ పాల్గొన్నారు.










