Oct 26,2023 22:19

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి కాకినాడ, అనకాపల్లి జిల్లాల సరిహద్దులో ఉన్న తాండవ సుగర్‌ చక్కెర పరిశ్రమ క్రషింగ్‌ నిలిచిపోవడంతో ఇటు రైతులు ఆందోళనకు గురవుతుండగా భారీగా పేరుకుపోయిన బకాయిలు మూడేళ్లుగా విడుదల చేయకపోవడంతో అటు కార్మికులు తీవ్ర కలత చెందుతున్నారు. కార్మికులకు చెల్లించాల్సిన వేతనాలు, అలవెన్స్‌లు, పిఎఫ్‌, ఇతర సొమ్ములు మొత్తంగా రూ.10 కోట్లుపైనే ఇవ్వాల్సి ఉంది.
1956 నుంచి కో అపరేటివ్‌ తాండవ సుగర్‌ పరిశ్రమ క్రషింగ్‌ కొనసాగిస్తుంది. 2.60 లక్షల టన్నుల కెపాటిసి గల ఈ పరిశ్రమ గరిష్టంగా 1.50 లక్షల టన్నుల వరకూ చెరకును క్రషింగ్‌ చేసిన సంస్థ క్రమంగా క్రషింగ్‌ను తగ్గిస్తూ వచ్చింది. 2021లో చివరి సారిగా కేవలం 60వేల టన్నులు మాత్రమే క్రషింగ్‌ చేశారు. ప్రస్తుతం పరిశ్రమ మూతబడింది. సాంకేతికంగా అనకాపల్లి జిల్లా పరిధిలో పరిశ్రమ ఉంది. ఆ జిల్లాలో కోటఉరట్ల, నర్సీపట్నం, నాతవరం, పాయకరావుపేట, కాకినాడ జిల్లాలో తుని, రౌతులపూడి, కోటనందూరు, ప్రత్తిపాడు, తొండంగి మండలాలకు చెందిన దాదాపు 12 వేల మంది రైతులు చెరకును పండించి పరిశ్రమకు తోలే వారు.
బకాయిలు అందక...
2021 మార్చిలో క్రషింగ్‌ నిలిపివేసిన సంస్థ ఏడాది పాటు రైతులకు సుమారు రూ.10 కోట్లు వరకూ చెరకు బకాయిలు విడుదల చేయలేదు. పరిశ్రమ యాజమాన్యం ఎప్పుడు ఇస్తామనేది కూడా స్పష్టత ఇవ్వలేదు. ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా పట్టించుకోలేదు. దీంతో సిపిఎం, ఎపి రైతు సంఘాల నాయకులు రంగంలోకి దిగి దశలవారీగా పోరాటాలు సాగించారు. యాజమాన్యం దిగొచ్చే వరకూ ఉద్యమం చేశారు. ఎట్టకేలకు స్పందించి రైతుల బకాయిలను విడుదల చేశారు.
పరిశ్రమలో పని చేస్తున్న దాదాపు 500 మంది రెగ్యులర్‌, కాంట్రాక్టు కార్మికులకు ఇవ్వాల్సిన బకాయిలను మాత్రం నేటికీ ఇవ్వలేదు. ఒక్కొక్కరికీ నెలకు రూ.20 నుంచి రూ.25 వేలు వరకూ ఏడాది నుంచి 2 సంవత్సరాలు వరకూ బకాయిలు ఉన్నాయి. ఇలా సుమారు రూ.10 కోట్లుపైనే వేతన బకాయిలు రావాల్సి ఉందని కార్మికులు తెలిపారు.
పూట గడవని కార్మికులు
తాండవ సుగర్‌ పరిశ్రమ మూతపడటంతో కార్మికుల పాధికి పూర్తిగా గండి పడింది. ఏళ్ల తరబడి ఇదే పరిశ్రమలో పని చేసిన అనేక మంది కార్మికులు ఇప్పుడు ఎటువంటి పని దొరక్క కుటుంబ పోషణ కష్టంగా మారింది. అప్పులు చేసి పోషించుకునే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెరిగిన ధరలతో పోల్చుకుంటే పూట గడవడం కష్టంగా మారిందని బాధ పడుతున్నారు. ఈ నేపథ్యంలో పరిశ్రమ భారీగా బకాయిలు పెట్టడంతో అప్పులు పుట్టక పరిస్థితి మరీ దయనీయంగా మారిందని చెబుతున్నారు. ప్రభుత్వం, పాలకులు స్పందించి పెండింగ్‌ బకాయిలను ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని, అలాగే తిరిగి పరిశ్రమ కార్యకలాపాలను ప్రారంభించి ఆదుకోవాలని కార్మికులంతా కోరుతున్నారు.