కడప : విద్యుత్ సంస్థలో పనిచేసే ఉద్యోగి తాము చేయబోయే పనిమీద ముందుగా లక్ష్యాలను నిర్దేశించుకుని పనిచేస్తే ఫలితాలు అద్భుతంగా ఉంటాయని దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ చీఫ్ జనరల్ మేనేజర్ ధర్మజ్ఞాని అన్నారు. ప్రధానంగా విద్యుత్ బకాయిలపై ప్రత్యేక దష్టి సారించాలని ఆదేశించారు. మంగళవారం కడపలోని విద్యుత్ భవన్‌లోని సమావేశ మందిరంలో ఉమ్మడి వైఎస్‌ఆర్ కడప జిల్లా అధికారులతో ఆర్థిక ప్రగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిల్ స్టాప్ సర్వీసులు, విద్యుత్ చైర్యం పై వేసిన అపరాధ రుసుములు, డెవలప్మెంట్ ఛార్జీలు, మొండి బకాయిలు మొత్తం జిల్లాలో రూ.47 కోట్ల మేర పేరుకపోయాయని పేర్కొన్నారు. ఏ రోజుకు ఆ రోజు డబ్బులు చెల్లించి విద్యుత్ కొనుగోలు చేసి వినియోగదారులకు సరఫరా చేస్తు న్నామని చెప్పారు. వినియోగదారులు వారి విద్యుత్ సమస్యలపై కార్యాలయాలకు వచ్చినప్పుడు మర్యాదపూ ర్వకంగా వారితో మమేకమై వారి సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో కార్పొరేట్ ఆఫీస్ తిరుపతి నుంచి రెవెన్యూ అధికారి శ్రీధర్, ఎఎస్‌ఆర్ జిల్లా విద్యుత్ శాఖ సూపరింటెండింగ్ ఇంజినీర్ ఎస్.రమణ, సీనియర్ అకౌంట్ ఆఫీసర్ మధు, అకౌంట్స్ ఆఫీసర్ మల్లికార్జున్, కడప డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎల్. నరసింహ ప్రసాద్, ఉమ్మడి వైఎస్‌ఆర్ జిల్లా అకౌంట్స్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.










