
ప్రజాశక్తి - కలెక్టరేట్ : జిల్లాలో రెండు నెలలుగా అంగన్వాడీలకు వేతనాలు లేక చాలా ఇబ్బందులుపడుతున్న పరిస్థితి తెలియజేస్తూ అంగన్వాడీ యూనియన్ తరపున శుక్రవారం జెసి గోవిందరావుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు ఎం.ఉమామహేశ్వరి మాట్లాడుతూ వర్కర్లకు వచ్చే వేతనాలు తక్కువగా ఉన్నాయని, దీనికి తోడు పండగ పూట కూడా వేతనాలు లేకుండా దసరా, దీపావళి పండగలు చేసుకోలేని పరిస్థితి ఉందని అన్నారు. అలాగే దీపావళి పండగ పూట కూడా పిల్లతో సహా అంగన్వాడీ వర్కర్లు పస్తులు ఉంచుకోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కార్యదర్శి గంట జ్యోతి మాట్లాడుతూ వర్కర్లంతా జీతాలు బిల్లులు సమయానికి రాక సెంటర్ నిర్వహించుకోవడం కష్టంగా ఉందని తెలిపారు. సిఐటియు జిల్లా నాయకులు వి.ఇందిరా మాట్లాడుతూ అందరికీ జీతాలు చెల్లించి వర్కర్ల కళ్లల్లో వెలుగును నింపాలని కోరారు. సమస్యలను విన్న జాయింట్ కలెక్టర్ వెంటనే ఐసిడిఎస్ పిడికి ఫోన్లోలో సంప్రదించి జీతాలు ఇవ్వకపోవడానికి కారణం తెలుసుకొని వెంటనే జీతాలయ్యేలా చర్యలు చేపడతామని తెలిపారు.