ప్రజాశక్తి- అరకులోయ రూరల్: అరకులోయ ఏరియా ఆసుపత్రిలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులు, సెక్యూరిటీ గార్డుల సమస్యలు పరిష్కరించాలని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో అరకులోయ ఏరియా ఆసుపత్రిలో వద్ద శనివారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా కో కన్వీనర్ అమర్ మాట్లాడుతూ, సెక్యూరిటీ సిబ్బంది, శానిటేషన్ వర్కర్లకు మూడు నెలల నుండి జీతాలు చెల్లించ లేదన్నారు. జీవో 549 ప్రకారం శానిటేషన్ వర్కర్లకు రూ.16 వేలు జీతాలు చెల్లించాలని ప్రభుత్వం ఆదేశించినా సంస్థ యాజమాన్యం పారిశుధ్య కార్మికులకు రూ.10,700, సెక్యూరిటీ గార్డులకు రూ. 8400 మాత్రమే చెల్లిందని పేర్కొన్నారు.పారిశుధ్య కార్మికులకు పీఎఫ్ రూ.1800 పైబడి చెల్లించాల్సి ఉండగా రూ.1175లు మాత్రమే ఇస్తూ మోసం చేస్తున్నారని అన్నారు. పారిశుధ్య కార్మికులు, సెక్యూరిటీ గార్డులు పలు సమస్యలతో సతమతం అవుతున్నా ప్రభుత్వం, యాజమాన్యం పట్టించుకోక పోవడం సరికాదని తెలిపారు. ఈ కార్యక్రమంలో పారిశుధ్య కార్మికులు ద్రౌపది, కృప, దసుధ, సూర్య, జయంతి, కోటి, సెక్యూరిటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.










