ప్రజాశక్తి - ఏలూరు
బకాయి జీతాలు వెంటనే ఇవ్వాలని కోరుతూ ఏలూరు నగరపాలక సంస్థ స్కూల్ స్వీపర్లు స్థానిక కలెక్టరేట్ వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బి.సోమయ్య మాట్లాడుతూ ఏలూరు నగరపాలక సంస్థ పరిధిలోని 49 పాఠశాలల్లో 56 మంది స్కూల్ స్వీపర్లు పని చేస్తున్నారన్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం 2022 జూన్‌లో 84వ నెంబర్ జిఒ పేరుతో మున్సిపల్ పరిపాలనా శాఖ పరిధిలోని పాఠశాలలను విద్యాశాఖకు బదిలీ చేసిందన్నారు. దీంతో మున్సిపల్ పాఠశాలల స్వీపర్లు, విద్యాశాఖకు బదిలీ అయ్యారని, రాష్ట్ర ప్రభుత్వం జిఒ విడుదల చేసి ఎనిమిది నెలలైనా విద్యా శాఖాధికారులు స్కూల్ స్వీపర్ల జీతాల గురించి ఏమాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. దీంతో స్కూల్ స్వీపర్లు నాలుగు నెలలుగా జీతాలు లేక అనేక అవస్థలు పడుతున్నారన్నారు. తక్షణమే బకాయి జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఏప్రిల్‌లో ప్రారంభమయ్యే పదో తరగతి పరీక్షలను బహిష్కరిస్తామని, పనులు నిలిపివేసి ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమాన్నుద్దేశించి శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్ కె.విజయలక్ష్మి, స్కూలు స్వీపర్ల యూనియన్ అధ్యక్షురాలు జి.స్వాతి, కార్యదర్శి జి.రాజారాంబాబు మాట్లాడారు. ఈ కార్యక్రమానికి నాగమణి, రామలక్ష్మి, ప్రమీల, వెంకటరమణమ్మ, ప్రియాంక తదితరులు నాయకత్వం వహించారు. అనంతరం కలెక్టరేట్ పరిపాలనాధికారికి వినతిపత్రం సమర్పించారు.










