అడిషనల్ కమిషనర్‌కు సమ్మె నోటీసు అందజేత
ఎపి మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ (సిఐటియు)
ప్రజాశక్తి - ఏలూరు టౌన్
ఏలూరు నగరపాలక సంస్థ కాంట్రాక్ట్ కార్మికులకు, స్కూల్ స్వీపర్లకు రావాల్సిన రూ.ఐదు కోట్లకుపైగా బకాయి జీతాలు, హెల్త్ అలవెన్స్‌లు, పిఆర్‌సి ఎరియర్స్ కోసం ఫిబ్రవరి 3వ తేదీ నుండి నిరవధిక సమ్మె చేపట్టాలని ఎపి మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ (సిఐటియు) నగర కమిటీ సమావేశం నిర్ణయించింది. స్థానిక సిఐటియు కార్యాలయంలో యూనియన్ అధ్యక్షులు లావేటి కృష్ణారావు అధ్యక్షతన నగర కమిటీ సమావేశం జరిగింది. సమావేశంలో సిఐటియు జిల్లా నాయకులు బి.సోమయ్య, యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.జాన్‌బాబు పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలోనూ, జిల్లాలోనూ ఏ మున్సిపాల్టీలో కూడా కాంట్రాక్ట్ కార్మికులకు ఎలాంటి బకాయిలూ లేవన్నారు. అయితే ఏలూరు నగరపాలక సంస్థలో సంవత్సరం కాలంగా కాంట్రాక్ట్ కార్మికులకు రావాల్సిన బకాయి జీతాలు, బకాయి హెల్త్ అలవెన్స్‌లు, పిఆర్‌సి ఎరియర్స్ చెల్లించకుండా ఇబ్బందుల పాల్జేస్తున్నారని అన్నారు. మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు నామమాత్రపు వేతనాలపై పని చేస్తున్నారని, ఇలాంటివారు కోట్లాది రూపాయల బకాయిల వల్ల వినాయక చవితి, దసరా, దీపావళి, క్రిస్మస్, సంక్రాంతి వంటి పండుగలన్నీ పస్తులతోనే గడిపారన్నారు. అధికారులు, పాలకుల చుట్టూ తిరిగి తిరిగి వేసారిపోయారని, తప్పనిసరి పరిస్థితుల్లో సమ్మెలోకి వెళ్లాల్సి వస్తుందని అన్నారు. ఇప్పటికైనా మున్సిపల్ పాలకవర్గం, అధికారులు, జిల్లా అధికారులు స్పందించి ఫిబ్రవరి రెండో తేదీలోపు రూ.ఐదు కోట్లకుపైగా రావాల్సిన బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో కార్మికుల నిరవధిక సమ్మెకు అధికారులదే పూర్తి బాధ్యతని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో కార్యదర్శి కారు దుర్గారావు, వివిధ సర్కిళ్ల నాయకులు, బంగారు వెంకటేశ్వరరావు, పంతం చిన్న నాగరాజు, తానంకి జార్జి, అల్లం హనుమంతరావు, బంగారు దుర్గారావు, జి.నారాయణరాజు, బి.రమేష్, ఎం.గోపి, ఎ.రామకృష్ణ, మందపాటి దుర్గారావు పాల్గొన్నారు. ఫిబ్రవరి మూడో తేదీ నుండి చేపట్టబోయే సమ్మె గురించి మున్సిపల్ అధికారులు, పాలకవర్గానికి సమ్మె నోటీసులు ఇవ్వాలని సమావేశం నిర్ణయించింది. మున్సిపల్ కార్మికులు మూడో తేదీ నుండి చేపట్టబోయే సమ్మెకు నగరంలోని ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, ప్రజాసంఘాలు, ప్రజానీకం అంతా మద్దతివ్వాలని సమావేశం విజ్ఞప్తి చేసింది. అనంతరం అడిషనల్ కమిషనర్ బాపిరాజుకు నేతలు సమ్మె నోటీసు అందజేశారు.










