Aug 04,2023 23:59

ధర్నాలో మాట్లాడుతున్న సిఐటియు నేత కోటేశ్వరరావు

ప్రజాశక్తి- అనకాపల్లి
బకాయి జీతాలు చెల్లించాలని కోరుతూ స్థానిక కలెక్టరేట్‌ వద్ద శుక్రవారం పంచాయతీ పారిశుధ్య కార్మికులు, గ్రీన్‌ అంబాసిడర్లు, ఎలక్ట్రీషియన్లు సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి జి కోటేశ్వరరావు మాట్లాడుతూ అనకాపల్లి జిల్లాలో 654 గ్రామపంచాయతీలలో పారిశుధ్య కార్మికులు, గ్రీన్‌ అంబాసిడర్లు, ఎలక్ట్రీషియన్లు అనేక సంవత్సరాలుగా చాలీచాలని జీతాలతో పనిచేస్తున్నారని, వీరికి నెలల తరబడి జీతాలు ఇవ్వకపోవడంతో వారి కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. టెండర్‌ విధానం రద్దుచేసి ప్రభుత్వం నేరుగా జీతం చెల్లించాలని కోర్టు తీర్పు ఇచ్చినా ఎక్కడ అమలు కావడం లేదన్నారు. గ్రామాభివృద్ధికి వచ్చిన పంచాయతీ నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఇతర పనులకు వాడుకోవడంతో నిధులు లేక కార్మికుల జీతాలు ఇవ్వడం లేదని తెలిపారు. కార్మికులకు ఇవ్వాల్సిన సబ్బులు, నూనె, తువ్వాలు, యూనిఫామ్‌, బూట్లు, రక్షణ పరికరాలు ఎక్కడా ఇవ్వడం లేదన్నారు. గతంలో ప్రభుత్వం ఇచ్చిన జీవో 57, 132, 680 లను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. జిల్లా జిల్లా పంచాయితీ అధికారి ధర్నా శిబిరానికి వచ్చి కార్మికులకు సంతృప్తికరమైన సమాధానం చెప్పకపోవడంతో ఆమె వాహనాన్ని అడ్డగించారు. దీంతో ఆమె ధర్నా శిబిరానికి వచ్చి కార్మికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. జీతాలు వేయాలని ఆదేశించామని, ఎక్కడా జీతాలు రాకుంటే తెలియజేయాలని ఆమె కోరారు. కార్యక్రమంలో సిఐటీయూ జిల్లా అధ్యక్షులు ఆర్‌.శంకర్రావు, యూనియన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు పలివేల చిన్నారావు, మలకలపల్లి రాజు, నక్కా రవికుమార్‌, సీతారాం, కె.వెంకటరమణ, ఈశ్వరరావు, పరదేశి, జి.సన్యాసినాయుడు, ఈశ్వరమ్మ, కార్మికులు పాల్గొన్నారు.