Aug 14,2023 21:53

రేషన్‌ సరఫరా వాహనాలే అడ్డా..!
బియ్యం ఇచ్చేది వారే.. కొనేది వారే
కిలో రూ.పదికి కొనుగోలు
వందలాది మెట్రిక్‌టన్నులు పక్కదారి
మార్కెట్‌లో అధిక ధరకు విక్రయం
తూతూమంత్రంగా విజిలెన్స్‌ తనిఖీలు
యథేచ్ఛగా అమ్మకం.. కొనుగోలు
ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి

రేషన్‌ బియ్యం దందా రెండు జిల్లాల్లోనూ యథేచ్ఛగా సాగుతోంది. 'ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టలేడన్న' చందంగా ఈ బియ్యం దందా సాగుతోంది. ప్రభుత్వం రేషన్‌ సరఫరాకు ఏర్పాటు చేసిన వాహనాల్లోనే ఈ వ్యాపారం సాగడం విశేషం. రేషన్‌ బియ్యం ఇచ్చేది వారే.. తిరిగి కొనుగోలుచేసేది వారేకావడం విశేషం. జిల్లాలో ఈ తతంగం యథేచ్ఛగా సాగుతోంది. కట్టడి చేయాల్సిన అధికారులు ప్రేక్షకపాత్ర వహిస్తున్నారు. విజిలెన్స్‌ అధికారులు రోడ్లపై వాహనాలు తనఖీచేసి ఒకటి అర పట్టుకోవడం తప్ప.. రేషన్‌ బియ్యం దందా జరిగే మూలాలపై అధికారులు దృష్టిసారించని పరిస్థితి నెలకొంది. రెండు జిల్లాల్లో దాదాపు 11.73 లక్షల వరకూ అన్నపూర్ణ, అంత్యోదయ, తెల్ల రేషన్‌కార్డుదారులున్నారు. ఏలూరు జిల్లాలో 6.39 లక్షల వరకూ ఉండగా, పశ్చిమలో 5.33 లక్షలకు పైగాకార్డులున్నాయి. రేషన్‌ సరుకులు ఇంటికి అందించేవిధంగా ప్రభుత్వం ఎమ్‌డియుఎస్‌ వాహనాలను ఏర్పాటు చేసింది. ఏలూరు జిల్లాలో 408, పశ్చిమలో 343 మొత్తం 751 రేషన్‌ వాహనాలున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. ప్రతినెలా ఏలూరు జిల్లాలో తొమ్మిదివేలకుపైగా మెట్రిక్‌ టన్నుల బియ్యం, పశ్చిమగోదావరి జిల్లాలో ఏడువేలకు పైగా మెట్రిక్‌ టన్నుల బియ్యం రేషన్‌వాహనాల ద్వారా పంపిణీ అవుతోంది. జిల్లాలో ఎన్నో కుటుంబాలు రేషన్‌ బియ్యంపైనే ఆధారపడి జీవిస్తున్నాయి. బియ్యం నాణ్యతలేవన్న కారణంగా దాదాపు 40 శాతం రేషన్‌ బియ్యం పక్కదారి పడుతున్నట్లు సమాచారం. నాణ్యమైన బియ్యం అందించి రేషన్‌ బియ్యం అక్రమాలకు అడ్డుకట్ట వేయాల్సిన ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.
రెచ్చిపోతున్న బియ్యం మాఫియా
రేషన్‌ కార్డుదారుల నిస్సహాయతను ఆసరాగా చేసుకుని జిల్లాలో రేషన్‌ బియ్యం మాఫియా రెరచ్చిపోతుంది. అందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన రేషన్‌ పంపిణీ వాహనాలే వేదికగా మారడం విశేషం. ప్రతినెలా రేషన్‌ బియ్యం అందించే వాహనదారులే లబ్ధిదారుల నుంచి బియ్యం కొనుగోలు చేస్తున్నారు. కిలో రూ.పదికి కొనుగోలు చేసి అధిక ధరలకు అమ్ముకుంటున్నారు. ప్రతినెలా ఇది పెద్దఎత్తున సాగుతోంది. నడిరోడ్డుపై ఈ వ్యాపారం సాగిపోతున్నప్పటికీ అడిగే నాథుడే లేకుండా పోయాడు. రేషన్‌వాహనాలను తనిఖీలు చేస్తే ఎన్ని కేజీల బియ్యం విక్రయించారు. వాహనాల్లో ఎంత బియ్యం ఉందో ఇట్టే తెలిసిపోతుంది. అయినప్పటికీ ఏ ఒక్క అధికారీ పట్టించుకోవడం లేదు. సామాన్య ప్రజానీకం నుంచి రేషన్‌ బియ్యం కొనుగోలు చేసి అక్రమంగా తరలించేస్తున్నారు. రోడ్లపై విజిలెన్స్‌ అధికారులు నిర్వహించే తనిఖీల్లో ఒకటి, అర మాత్రమే పట్టుబడుతున్నాయి. రోడ్లపై తనిఖీలు చేయడం తప్ప అసలు రేషన్‌ బియ్యం దందా మూలాలను మాత్రం ఏ ఒక్కరూ గుర్తించడం లేదు. రేషన్‌ వాహనాలు వచ్చిన తర్వాత రేషన్‌ బియ్యం దందా మూడు పువ్వులు, ఆరుకాయలు అన్నట్లు సాగుతుంది. ఈ దందాకు అడ్డుకట్ట వేయాలని అంతా కోరుతున్నారు. అదే సమయంలో జనాలు మెచ్చే నాణ్యమైన బియ్యం రేషన్‌ వాహనాల్లో ప్రభుత్వం అందిస్తే ప్రయోజనం ఉంటుంది.