
ప్రజాశక్తి - నరసాపురం టౌన్, మొగల్తూరు
వైసిపి ప్రభుత్వంలో అత్యధిక మంత్రి పదవులు బిసిలు, ఎస్‌సిలకే దక్కాయని, ఈ ఘనత సిఎం జగన్‌కే దక్కుతుందని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. స్థానిక మెయిన్ సెంటర్‌లో శుక్రవారం సామాజిక సాధికారిత యాత్ర సభ నిర్వహించారు. తొలుత మొగల్తూరు నుంచి ప్రారంభమైన యాత్ర రామన్నపాలెం మీదుగా పట్టణానికి చేరుకుంది. ఈ సందర్భంగా నిర్వహించిన సభకు స్థానిక ఎంఎల్‌ఎ, ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు అధ్యక్షత వహించారు. మంత్రి గోపాలకృష్ణ మాట్లాడుతూ జగన్ పాలనతోనే పేదరికం రూపుమాపుతోందని, పేదోడి జీవితంలో మార్పు మొదలైందని తెలిపారు. మరో మంత్రి సిదిరి అప్పలరాజు మాట్లాడుతూ బిసిలను ఛీకొట్టిన చంద్రబాబు జైలు పాలయ్యాడని ఎద్దేవా చేశారు. బిసిలను అవమానించిన చంద్రబాబుకు రానున్న ఎన్నికల్లో కూడా పిలుపునిచ్చారు. మంత్రి పినిపే విశ్వరూప్ మాట్లాడుతూ ప్రజల కోసమే ఆలోచించే నాయకుడు జగన్ అని, జగన్ మళ్లీ ముఖ్యమంత్రి అయితేనే దళితులకు, బిసిలకు గుర్తింపు లభిస్తుందని అన్నారు. మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ వైసిపి బిసిల పార్టీ అని అన్నారు. ఉన్నత విద్యతోనే పేదరికాన్ని రూపుమాపొచ్చని జగన్ నిరూపించారన్నారు. కార్యక్రమంలో మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, శాసనమండలి ఛైర్మన్ కొయ్యే మోషేన్‌రాజు, రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, ఎంఎల్‌సి వంక రవీంద్ర, కవురు శ్రీను, పోతుల సునీత, రీజినల్ కోఆర్డినేటర్, ఎంపీ మిథున్‌రెడ్డి, మున్సిపల్ ఛైర్‌పర్సన్ బర్రె వెంకటరమణ జయరాజు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. యాత్ర ప్రారంభానికి ముందు మొగల్తూరులోని లక్ష్మీ వెంకటేశ్వర కళ్యాణ మండపంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రులు మాట్లాడారు. కార్యక్రమంలో క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ పాతపాటి శ్రీనివాసరాజు, డిసిసిబి ఛైర్మన్ పివిఎల్ నరసింహారాజు, జెడ్‌పిటిసి తిరుమాని బాపూజీ తదితరులు పాల్గొన్నారు.