Sep 01,2023 01:07

పిడుగురాళ్ల సభలో నాయకుల అభివాదం

ప్రజాశక్తి-గుంటూరు జిల్లాప్రతినిధి, పిడుగురాళ్ల : రాష్ట్రంలో బాగా వెనుకబడిన తరగుతుల ప్రజల కోసం గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన మోస్టు బ్యాక్‌వార్డు క్లాస్‌ కార్పొరేషన్‌ను వైసిపి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని టిడిపి బిసి విభాగం కన్వీనర్‌, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. గుంటూరులోని టిడిపి జిల్లా కార్యాలయం, పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో నిర్వహించిన వెనుకబడిన జాతుల విముక్తి దినోత్సవ సభల్లో ఆయన మాట్లాడారు. వెనుకబడిన తరగతుల్లో వివిధ జాతులవారు ఇప్పటికీ అన్ని రంగాలలో విద్య, ఉద్యోగ, రాజకీయ రంగంలో వెనుకబడి సమాజంలో వివక్షతకు గురి అగుతున్నారని అన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వం ఎంబిసి కార్పోరేషన్‌ ఏర్పాటు చేసి ఆర్థిక వెసులుబాటును కల్పించారని, కానీ వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక యంబిసి కార్పోరేషన్‌ను నిర్విర్యం చేసి వారిని అణిచివేతకు గురిచేసిందన్నారు. పేరుకు 52 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి నిధులు లేకుండా చేశారని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం నిర్వీర్యం చేసిన ఎంబీసీ కార్పొరేషన్‌ ని మరలా పునరుద్ధరించి సంచార, విముక్త జాతులకు ఆర్ధిక పరమైన సహకారం అందించాలని డిమాండ్‌ చేశారు. సంచార, విముక్త జాతుల వారి పిల్లలకు ఆశ్రమ పాఠశాలలు ఏర్పాటు చేసి నిర్బంధ విద్యను అందించాలని, ఎస్సి, ఎస్టీ అట్రాసిటీ చట్టం మాదిరి సంచార, విముక్త జాతుల వారికి కూడా అట్రాసిటీ చట్టాన్ని ఏర్పాటు చేసి వారికి రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కార్యక్రమాల్లో మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, వి.గురుమూర్తి, టి.చంద్రశేఖర్‌ యాదవ్‌, ఎస్‌.కనకాచారి కె.వేణుగోపాల్‌, మణికంఠ,పాల్గొన్నారు.