మదనపల్లె అర్బన్ : బిసిలను వైసిపి, టిడిపి మభ్యపెడుతున్నాయని బిఎస్‌పి రాష్ట్ర ఉపాధ్యక్షులు బందెల గౌతం కుమార్ అన్నారు. విజయవాడలో 9వ తేదీన తలపెట్టిన బిసిల సమస్యలపై బహుజన్ సమాజ్ పార్టీ రౌండ్‌టేబుల్ సమావేశానికి సంబంధించిన కరపత్రాలను గురువారం స్థానిక కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 76 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో కాంగ్రెస్, బిజెపి, టిడిపి, వైసిపిలు బిసిలను ఓట్ల యంత్రాలుగా చూసారే తప్ప, వారిని ఎక్కడ కూడా రాజ్యాధికారంలో భాగస్వామ్యం చేసిన పరిస్థితి లేదన్నారు. నిజంగా బిసిల పట్ల చిత్తశుద్ధి ఉండి ఉంటే నేటికీ ఎందుకు దేశంలో గాని, రాష్ట్రంలో గాని బిసిలకు చట్టసభలలో రిజర్వేషన్లు లేవు, విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు లేవని ప్రశ్నించారు. ఈ ఒక్క అంశమే బిసిల పట్ల ఈ రాజకీయ పార్టీల చిత్తశుద్ధిని తెలియజేస్తుందన్నారు. ఈ దేశంలో బిసిల కోసం పనిచేసే ఏకైక రాజకీయ పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ అన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బిసి రిజర్వేషన్ల కోసం రాజ్యాంగంలో ఆర్టికల్ 340 పొందుపరిస్తే వాటిని బిజెపి, కాంగ్రెస్ అమలు చేయకపోతే కాన్షీరామ్ మండల కమిషన్‌ను అమలు చేయాలని ఢిల్లీలో 48 రోజులపాటు నిర్విరామంగా ధర్నా కార్యక్రమం నిర్వహించి మండల కమిషన్ నివేదికను అమలు పరచడంలో కీలకపాత్ర పోషించారని వివరించారు. కార్యక్రమంలో బిఎస్‌పి నాయకులు రెడ్డిమోహన్, ఆన్సర్‌బాషా, రమణ, బాలాజీ, మహేష్, శీను, హరి, ఆనంద్, పెద్దోడు, అనిల్, రవి, మస్తాన్, మణి, శ్రావణ్ పాల్గొన్నారు.










