ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్ రాష్ట్రంలో బిసిల సంక్షేమం, అభివృద్ధికి పాతరేస్తూ వైసిపి ప్రభుత్వం తీరని ద్రోహం చేసిందని టిడిపి అనంతపురం పార్లమెంట్ అధ్యక్షులు కాలవశ్రీనివాసులు, పొలిట్‌బ్యూరో సభ్యులు బిటి.నాయుడు అన్నారు. శుక్రవారం టిడిపి ఆధ్వర్యంలో నగరంలోని ఎన్టీఆర్ మార్గ్ సమీపంలో ఉన్న షిరిడీ సాయిబాబా కళ్యాణ మండపంలో బిసిల హక్కులపై రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాలుగున్నరేళ్ల వైసిపి పాలనలో బిసిల సంక్షేమం, అభివృద్ధి కుంటుపడిందన్నారు. పరిపాలనలో బిసిలను భాగస్వాములను చేయలేదన్నారు. ఇచ్చిన పదవులు పదవి అలంకరణలకే పరిమితం చేశారని, వారి స్వేచ్ఛను కూడా హరించిందన్నారు. రాష్ట్రంలో నలుగురు రెడ్లు ఏం చెబితే అదే వైసిపిలోనూ, ప్రభుత్వంలోనూ ఆదేశాలను సిరాసవహిస్తు పరిపానల సాగిస్తున్నారని విమర్శించారు. బిసిలకు ప్రాధాన్యత లేకుండా పోయిందన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి పెత్తందారి పోగడతో పాలన కొనసాగిస్తున్నాడని విమర్శించారు. రాష్ట్రంలో సాగుతున్న నరహంతక, విధ్వంస, అరాచక, ద్రోహపూరిత పరిపాలను అంతమొందించేందుకు బిసిలంతా ఐక్యమవుతున్నారని తెలిపారు. బిసిల సంక్షేమం, అభివృద్ధి కోసం భవిష్యత్ కార్యచరణ రూపొందించి బిసి వ్యతిరేక చర్యలను ఎండగడతామన్నారు. బిసి కార్పొరేషన్‌లు నిర్వీర్యం అయ్యాయన్నారు. 16,800 బిసిలకు ఇవ్వాల్సిన పోస్టులు మంగళం పాడేశారని విమర్శించారు. రాబోవు ఎన్నికల్లో బిసిల ఆగ్రహానికి వైసిపి ప్రభుత్వం గురికాక తప్పదన్నారు. టిడిపి రాష్ట్ర నాయకులు బిటి.నాయుడు మాట్లాడుతూ సమావేశంలో బిసిలంతా కలిసి 12 డిమాండ్లను ఏకగ్రీవంగా తీర్మాణం చేసినట్లు తెలిపారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే జితేంత్రగౌడ్, జెడ్పీ మాజీ ఛైర్మన్ పూల నాగరాజు, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి.జగదీష్, టిడిపి బిసి సెల్ జిల్లా అధ్యక్షులు ఆవుల క్రిష్ణయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మి నరసింహులు, టిడిపి రాష్ట్ర నాయకులు ఆదినారాయణ, శివబాల, జనసేన జిల్లా ఉపాధ్యక్షులు ఈశ్వరయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేంద్ర, టిడిపి రాష్ట్ర నాయకులు దేవళ్లమురళి, చంద్రశేఖర్‌యాదవ్, పద్మశాలివాహన సంఘం నేత జింకా సూర్యనారాయణ, కుమ్మర సంఘం రాష్ట్ర నాయకులు పోతులయ్య తదితరులు పాల్గొన్నారు.