Nov 10,2023 21:24

మాట్లాడుతున్న టిడిపి మాజీ మంత్రి నిమ్మల కష్ణప్ప

 కడప అర్బన్‌ : రాష్ట్ర జనాభాలో 55 శాతం ఉన్న బిసిల ఓట్లతో గద్దెనెక్కిన వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి వారికి తీరని అన్యాయం చేశారని తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి నిమ్మల కష్ణప్ప విమర్శించారు. నగరంలోని కింగ్స్‌ ఫంక్షన్‌ హాల్‌లో టిడిపి బిసి విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం బిసిలకు ప్రభుత్వ నమ్మక ద్రోహం పై, బిసి కుల సంఘాలు, అఖిలపక్షాలతో రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వై ఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి బిసి కులాలను ఉద్ధరించినట్లు కులానికి ఒక కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి ఒక్క పైసా ఇవ్వలేదన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెస్తాననని ప్రజలను నమ్మబలికి ద్రోహం చేశారని వాపోయారు. జగన్‌ పై అక్రమార్జజన కేసులు ఉన్నాయి కాబట్టే కేంద్రాన్ని ప్రత్యేక హోదాపై నిలదీయలేని పరిస్థితి అన్నారు. దాడి చేసి, రాళ్లు రువ్వితే వారికి మంత్రి పదవులిస్తున్నారని విమర్శించారు. టిడిపి పాలనలో 9 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి, నిధులు ఇచ్చి బిసిల ఆర్థిక ఎదుగుదలకు ప్రోత్సహించామని ఆయన గుర్తు చేశారు. ప్రతిపక్షంలో ఉన్న నాయకులకు ఎంతో గౌరవం ఉండేదని, జగన్‌ ప్రభుత్వంలో గౌరవం ఏమాత్రం లేదన్నారు. ఎన్‌టి రామారావు బిసిల రాజకీయ ఎదుగుదలకు అవకాశం ఇచ్చారని, చంద్రబాబు అదే కోవలో కల్పించారని, బిసిల ఐక్యతతో టిడిపిది గెలిపించి రాజకీయంగా ఎదగాలని ఆయన అన్నారు. అనంతరం టిడిపి పొలిట్‌ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ 2019లో పాలిచ్చే ఆవును కాదని, తన్నే దున్నను తెచ్చు కున్నామని చెప్పారు. కార్పొరేషన్లు ఏర్పాటు చేశారే కానీ ఆ కార్యాలయాల్లో కుర్చీ కూడా లేదన్నారు. జగన్‌ నిరంకుశ పాలనను బిసిలు అర్థం చేసుకున్నారని అన్నారు. టిడిపి హయాంలో బిసిలు రాజకీయంగా, ఆర్థికంగా ఎదిగారన్నది గుర్తుంచు కోవాలన్నారు. టిటిడి మాజీ చైర్మన్‌ పుట్టా సుధాకర్‌ యాదవ్‌ మాట్లాడుతూ బిసిల పార్టీ తెలుగుదేశం పార్టీ అని అన్నారు. ఉమ్మడి జిల్లా జనసేన ఇన్చార్జ్‌ సుంకర శ్రీనివాస్‌ మాట్లాడుతూ బిసిలనుఓటు బ్యాంకుగా రాజకీయ పార్టీలు వాడుకుంటున్నాయని అన్నారు. కార్యక్రమంలో బాలకష్ణ యాదవ్‌, టిడిపి రాష్ట్ర నాయకులు గోవర్ధన్‌, హరిప్రసాద్‌, లోక్‌సత్తా పార్టీ దేవర శ్రీకష్ణ, టిడిపి ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు మల్లెల లింగారెడ్డి, అఖిలపక్ష పార్టీల నాయకులు, కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.