Nov 20,2023 21:12

సదస్సులో మాట్లాడుతున్న మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు, నాయకులు

ప్రజాశక్తి-పార్వతీపురంరూరల్‌: ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో రాష్ట్రంలోని వెనుకబడిన వర్గాలు మరింతగా వెనుకబడ్డాయని, రాబోయే కాలంలో టిడిపి అధికారంలోకి వస్తుందని, బిసిలకు సముచిత స్థానం కల్పించి పూర్వవైభవం తీసుకువస్తామని మాజీ మంత్రి, టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు అన్నారు. సోమవారం పార్వతీపురం నియోజకవర్గం టిడిపి ఆధ్యర్వంలో ఇన్‌ఛార్జి బోనెల విజయచంద్ర అధ్యక్షతన నిర్వహించిన బిసి సదస్సుకు ముఖ్య అతిథిగా మాజీ మంత్రి కిమిడి కళా వెంకటరావుతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా యనమల మాట్లాడుతూ ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని వారికి మేలు చేయకపోగా రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించడమే కాకుండా అప్పులపాలు చేశారని విమర్శించారు. ప్రజావ్యతిరేకతను గమనించి సిఎం ఇప్పుడు కొత్తగా నా బిసిలు, ఎస్టీలు, ఎస్సీలు అంటూ కొత్తగా మరో మోసపూరిత నినాదం ఎత్తుకున్నారని ఎద్దేవా చేశారు. కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వాటికి నిధులు మంజూరు చేయకుండా నిర్వీర్యం చేశారని ఆరోపించారు. రాజ్యాంగం వీరికి కల్పించిన రిజర్వేషన్లు తుంగలో తొక్కారని అన్నారు. టిడిపి హయాంలో చంద్రబాబుపాలనను, ఇప్పటి పాలనతో పోలుస్తూ ప్రజలు బేరీజు వేసుకుంటున్నారని, రాబోయే కాలంలో వారికి తిరుగులేని గుణపాఠం చెపుతారని అన్నారు. అనంతరం కిమిడి కళావెంకటరావు మాట్లాడుతూ బిసిలను ఉన్నతులుగా తీర్చిన ఘనత టిడిపి వ్యవస్ధాపకులు ఎన్టీయార్‌ పాత్రను ఎవరూ మరిచిపోలేరన్నారు. అధికారంలోకి రాగానే కార్పొరేషన్లను ఆర్థికంగా బలోపేతం చేయడమే కాకుండా ఆదరణ పథకం తీసుకువచ్చి వారి అభివృద్ధికి తోడ్పడతామని అన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్‌, మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు, మాజీ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ డిశ్రీదేవి, టిడిపి నియోజకవర్గ పరిశీలకులు బి.గోవిందరాజులు, అరకుపార్లమెంటు బిసి సెల్‌ అధ్యక్షులు బూరాడ రామోహన్‌ రావు, జనసేన నియోజకవర్గ కన్వీనర్‌ ఎ.మోహన రావు మాట్లాడారు. కార్యక్రమంలో టిడిపి, జనసేన నాయకులు బోను చంద్రమౌళి, జి.రవికుమార్‌, కొల్లి తిరుపతిరావు, పి.వేణుగోపాలనాయుడు, కౌన్సిలర్లు బడే గౌరినాయుడు, తాతపూడి వెంకటరావు, కె.నారాయణరావు, కోల సరితమధు, సీతానగరం, బలిజిపేట మండలాలకు చెందిన బిసి నాయకులతో పాటు కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు.