ప్రజాశక్తి-విజయనగరంకోట : బిసిలకు పూర్వ వైభవం తీసుకు వద్దామని మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి, ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు అన్నారు. బిసిలకు అన్యాయం చేస్తున్న జగన్‌పై ఐక్యంగా పోరాడుదామని పిలుపునిచ్చారు. మంగళవారం ఓ ప్రైవేటు హోటల్‌లో 'జగన్ పాలనలో బిసిలపై దాడులు- ప్రభుత్వ వైఫల్యం'పై అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షులు కిమిడి నాగార్జున ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో సత్యనారాయణమూర్తి, రామారావు మాట్లాడారు. టిడిపి తొలి నుంచి బిసిలకు ప్రాధాన్యత ఇస్తోందన్నారు. వైసిపి చేపట్టిన సాధికార బస్సుయాత్రలో బిసిలకు ఏం చేశారో చెప్పలేక పోతున్నారని ఎద్దేవా చేశారు. ఉత్తరాంధ్ర బిసి నాయకులపై సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డి పెత్తనం ఏమిటని ప్రశ్నించారు. బిసి కులాలకు దగా చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు కులగణన చేపడుతున్నారని అన్నారు. కులాల వారిగా కార్పొరేషన్లు పెట్టినా వాటికి ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని మండిపడ్డారు. రాష్ట్రంలో బ్యాక్ లాగ్ పోస్టుల గురించి ఊసే లేదన్నారు. లోక్‌సత్తా అధ్యక్షులు భీశెట్టి బాబ్జీ మాట్లాడుతూ కులాల పునాదులపై వ్యవస్థలను నిర్మించలేమని అంబేద్కర్ ఏనాడో చెప్పారన్నారు సమాజాభివృద్ధి కోసం రాజకీయంగా, సామాజికంగా బలపడ్డానికి చర్యలు తీసుకోవాలన్నారు. మాజీ ఎమ్మెల్యే మీసాల గీత మాట్లాడుతూ బిసిల కష్టాలు పోవాలంటే ప్రజల్లో చైతన్యం రావాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర బిసి సెల్ ప్రధాన కార్యదర్శి గురుమూర్తి, పార్లమెంటరీ అధ్యక్షులు నారాయణ, లోక్‌సత్తా నాయకులు గురాన అయ్యలు, మాజీ ఎమ్మెల్యే కొండపల్లి అప్పలనాయుడు, రొంగలి రామారావు, బిజెపి నాయకులు బొబ్బిలి శ్రీను, సిపిఐ నుంచి అప్పారావు బిసి నాయకులు పాల్గొన్నారు.