
బిసి శ్మశానవాటిక షెడ్డును ప్రారంభించిన ఎంపిపి చంటిరాజు
ప్రజాశక్తి - పాలకోడేరు
బిసిల అభ్యున్నతికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని పాలకోడేరు ఎంపిపి భూపతిరాజు సత్యనారాయణరాజు (చంటిరాజు) అన్నారు. మండలంలోని వేండ్ర గ్రామంలో రూ.13.10 లక్షలతో నిర్మించిన బిసి శ్మశానవాటిక షెడ్డును ఎంపిపి చంటిరాజు శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిసిల కోరిక మేరకు శ్మశానవాటికలో షెడ్డును ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మండల పరిషత్ నిధులు రూ.10 లక్షలు, పంచాయతీ నిధులు రూ.3.10 లక్షలు ఈ షెడ్డు నిర్మాణానికి కేటాయించినట్లు తెలిపారు. దహన సంస్కారాలకు ఇబ్బందులు లేకుండా ఉండాలనే ముఖ్య ఉద్దేశంతో షెడ్డును నిర్మించినట్లు చెప్పారు. గ్రామంలో బిసి కులాలకు చెందిన వారంతా ఈ షెడ్డును సక్రమంగా వినియోగించుకోవాలని కోరారు. ముఖ్యంగా బిసిల అభ్యున్నతికి, సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అనేక కార్పొరేషన్లు ఏర్పాటు చేసి బిసిలకు వైసిపి ప్రభుత్వం సముచిత స్థానం కల్పించిందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచి కడలి నాగేశ్వరి, శ్రీవెంకట వీరబాబు, ఎంపిటిసి సభ్యులు పాలా జ్యోతి, వేండ్ర అగ్రహారం, కొండేపూడి సర్పంచులు కె.విజయలక్ష్మి, చింతపల్లి వెంకటనారాయణ (చిన్నా), గ్రామస్తులు సానబోయిన వేణు, కె.రాంబాబు, దొరబాబు, సీతయ్య, పాల శ్రీను, కమిటీ సభ్యులు టి.రామారావు, కె.పుల్లయ్య, మల్లుల కృష్ణ పాల్గొన్నారు.