Nov 22,2023 00:00

ప్రజాశక్తి - బాపట్ల
సామాజికంగా వెనుకబడిన వర్గాల సమగ్ర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కుల గణన సర్వే చేపట్టిందని మండల ప్రత్యేక అధికారి, డిఇఒ పివిజే రామారావు అన్నారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులకు, డిజిటల్ అసిస్టెంట్, గ్రామ రెవెన్యూ అధికారులకు కుల గణనపై నిర్వహించిన శిక్షణలో ఆయన మాట్లాడారు. కులగణన పారదర్శకంగా, నిస్పాక్షికంగా నిర్వహించాలని అన్నారు. ప్రజల్లో సందేహాలను నివృత్తి చేయాలని అన్నారు. ప్రజల్లో అపోహలను తొలగించాలని అన్నారు. సర్వే పట్ల విశ్వసనీయత పెంచేందుకు ఉద్యోగులు కృషి చేయాలని అన్నారు.  కుల గణన ద్వారా వచ్చే గణాంకాలతో బడుగు వర్గాల అభివృద్ధి కోసం పలు సంక్షేమ పథకాలను ప్రభుత్వం రూపొందించే అవకాశం ఉందని అన్నారు.  ఉద్యోగులు సమన్వయంతో అంకిత భావంతో పనిచేయాలని అన్నారు. ఇంచార్జ్ ఎంపీడీఒ పులి శరత్ బాబు మాట్లాడుతూ ఈనెల 27 నుండి డిసెంబర్ 3 వరకు సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు ప్రతి ఇంటిని సందర్శించి కులం, ఉప కులం, కుటుంబ సభ్యుల వివరాలను ప్రభుత్వం నిర్దేశించిన యాప్ ద్వారా నమోదు చేయాలని అన్నారు. డిప్యూటీ తహసీల్దారు శ్రీదేవి మాట్లాడుతూ కులగణన నమోదులో జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. సర్వే సందర్భంలో కుటుంబ సభ్యులను కొత్తగా చేర్చుకునే అవకాశం ప్రభుత్వం కల్పించిందని అన్నారు. కులగణనపై గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేసి సర్వేను పారదర్శకంగా నిర్వహించాలని అన్నారు.