Mar 03,2023 23:42

వెలిగించిన కొవ్వొత్తులతో నిరసన తెలుపుతున్న సిఐటియు నేతలు

సిఐటియు ఆధ్వర్యాన కొవ్వొత్తులతో నిరసన
ప్రజాశక్తి -గాజువాక
: బిసి రోడ్డులో వీధిదీపాలు వేసి, వెలిగించే చర్యలు చేపట్టాలని కోరుతూ పెదగంట్యాడ జంక్షన్‌ నుంచి సిఐటియు ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి వెలిగించిన కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు పాల అప్పలరెడ్డి, మురుకూటి వెంకటరావు మాట్లాడుతూ, బిసి రోడ్డులో వీధి దీపాలు లేక అంథకారంగా ఉండడంతో ఈ మార్గంలో ప్రయాణించే వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులకు గురౌతున్నారన్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో విధులు ముగించుకుని ఇళ్లకు వచ్చే స్టీల్‌ ప్లాంట్‌ ఉద్యోగస్తులు చీకట్లో నానా అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మార్గంలో రోడ్డు గోతులమయంగా ఉండడం, డివైడర్లు సరిగా లేకపోవడం, అక్కడక్కడా ఉన్న స్పీడ్‌బ్రేకర్ల వద్ద జీబ్రా లైన్లుగానీ, హెచ్చరిక బోర్డులు గానీ లేకపోవడంతో ఇక్కట్లు పడే దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాక ఆదానీ గంగవరం పోర్ట్‌ యాజమాన్యం ఇష్టానుసారంగా లారీలను బ్రిడ్జి కింద తిప్పుతున్నారన్నారు. దీంతో అటుగా వెళ్లే వాహనదారులతోపాటు స్టీల్‌ప్లాంట్‌ ఉద్యోగస్తులకు అసౌకర్యానికి గురికాక తప్పడం లేదన్నారు. ఇప్పటికైనా సంబంధిత జివిఎంసి యంత్రాంగం స్పందించి, బిసి రోడ్డులో వీధిదీపాలు ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని కోరారు. నిరసన ప్రదర్శనలో సిఐటియు నాయకులు పాల శ్రీనివాసరెడ్డి, రెడ్డి బాబు, చిన్న అప్పారావు, కృష్ణమూర్తి, బి వెంకటరావు, బైరెడ్డి గుర్రప్ప, కణితి అప్పలరాజు, శంకర్‌ పాల్గొన్నారు.