
బిసి, ఎస్‌సి, ఎస్‌టి మైనార్టీలకు సముచిత గౌరవం
- చంద్రబాబు రాష్ట్రాన్ని పాలించడానికి అనర్హుడు
- చేసిన అభివృద్ధి చెప్పేందుకే బస్సు యాత్ర
- ఉప ముఖ్యమంత్రులు అంజాద్ భాష, నారాయణ స్వామి
ప్రజాశక్తి - ఆళ్లగడ్డ
బిసి, ఎస్‌సి, ఎస్‌టి మైనార్టీలకు సమాజంలో సముచిత గౌరవం కల్పించిన నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ఉప ముఖ్యమంత్రులు అంజాద్ భాష, నారాయణస్వామిలు అన్నారు. మంగళవారం ఆళ్లగడ్డలో సామాజిక సాధికార బస్సు యాత్రలో పాల్గొనేందుకు వచ్చిన సందర్భంగా స్థానిక మహాలక్ష్మి ఫంక్షన్ హాల్‌లో పాత్రికేయుల సమావేశం జరిగింది.ఉప ముఖ్యమంత్రి అంజాద్ భాష మాట్లాడుతూ రాష్ట్రంలోని ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమలో సామాజిక సాధికార యాత్రకు జనం నీరాజనాలు పలుకుతున్నారన్నారు. సింహ భాగంలో నవరత్నాలు బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు దక్కాయన్నారు. ఉప ముఖ్యమంత్రులుగా, రాజ్యసభ సభ్యులుగా, ఎమ్మెల్యేలుగా ఎక్కువ శాతం దామాషా ప్రకారం బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు ప్రాధాన్యత ఇచ్చారన్నారు. ప్రజల్లో చైతన్యం తీసుకు రావడమే సామాజిక సాధికార బస్సు యాత్ర ముఖ్య ఉద్దేశ్యమన్నారు. టిడిపి 14 సంవత్సరాలుగా బీసీల పార్టీ అని చెప్పుకుందే గాని వారికి న్యాయం చేయలేదన్నారు. ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి మాట్లాడుతూ ఎన్టీఆర్ నుంచి పార్టీ లాక్కున్న ఘనత చంద్రబాబుదన్నారు. చంద్రబాబు వెంట ఉండేది మోసగాళ్లు, అవినీతిపరులని విమర్శించారు. చంద్రబాబు రాష్ట్రాన్ని పాలించడానికి అనర్హుడని, వ్యాధిగ్రస్తుడని మానవతా దృక్పథంతో బెయిల్ మంజూరు చేశారన్నారు. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రిలను ప్రజలు నేరుగా ఎన్నుకునేలా విధానం రావాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పాత్రికేయులకు మూడు సెంట్ల స్థలం ఇవ్వాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. విజయనగరం ఎంపీ బెల్లాల చంద్రశేఖర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు అభివృద్ధి, సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని వచ్చే ఎన్నికల్లో వైసిపిని గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రారెడ్డి, ఎపి జల వనరుల శాఖ గౌరవ సలహాదారులు గంగుల ప్రభాకరరెడ్డి, నియోజకవర్గ ఇన్‌చార్జి నరసింహారెడ్డి, విజయ మిల్క్ డైరీ చైర్మన్ ఎస్వి జగన్మోహన్ రెడ్డి, వైసిపి రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి షేక్ బాబులాల్, ఆళ్లగడ్డ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ నాయబ్ రసూల్, విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ వరలక్ష్మి, ఎంపిపి గజ్జల రాఘవేంద్ర రెడ్డి, రాష్ట జల వనరుల శాఖ డైరెక్టర్ కర్రా గిరిజ, హర్షవర్ధన్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు.