Nov 15,2023 21:30

ర్యాలీని ప్రారంభిస్తున్న ఐటిడిఎ పిఒ విష్ణుచరణ్‌

ప్రజాశక్తి - పార్వతీపురం : ఆదివాసీల స్వాతంత్య్ర సమరయోధుడు, జానపద నాయకుడు బిర్సా ముండా జయంతిని పురష్కరించుకొని గిరిజన స్వాభిమాన్‌ ఉత్సవాలను బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్‌టిసి బస్టాండు నుండి ఐటిడిఎ కార్యాలయం వరకు నిర్వహించిన ర్యాలీని ప్రాజెక్టు అధికారి సి.విష్ణుచరణ్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా పిఒ మాట్లాడుతూ బిర్సాముండా స్వాతంత్య్రోద్యమ చరిత్రలో ఒక ప్రముఖ వ్యక్తిగా నిలిచిపోయారని పేర్కొన్నారు. ర్యాలీ అనంతరం పురపాలక చైర్‌పర్సన్‌ బోను గౌరీశ్వరి అధ్యక్షతన ఐటిడిఎ సమావేశ మందిరంలో సమావేశం నిర్వహించారు. స్వాతంత్య్ర సమరయోధులు, గిరిజన నాయకులు అల్లూరి సీతారామరాజు, బిర్సా ముండా, మల్లుదొర, గంటందొర, బోనంగి పండుపడాల్‌, కుడుముల బయ్యన్న, హనుమంతప్ప, దిప్పల సూరన్నదొర చిత్రపటాలకు పూలమాలవేసి నివాళ్లు అర్పించారు. అనంతరం చైర్‌పర్సన్‌ మాట్లాడుతూ దేశస్వాంతంత్య్రం కోసం ఎందరో ప్రాణత్యాగం చేశారని, వారి త్యాగాల ఫలితమే నేడు మనం అనుభవిస్తున్న స్వేచ్చా స్వాతంత్య్రాలని తెలిపారు. వారిని ఆదర్శంగా తీసుకొని సమాజసేవకు ప్రతి ఒక్కరు పాటుపడాలని తెలిపారు. గిరిజన నాయకులు ఆరిక విప్లవకుమార్‌, సీతారాం మాట్లాడుతూ బిర్సాముండా అతి చిన్నవయసులోనే బ్రిటీషు వారికి వ్యతిరేకంగా పోరాడారని తెలిపారు. కార్యక్రమంలో ఎపిఒ పి.మురళీధర్‌, వెలుగు ఎపిడి సత్యంనాయుడు, ఐటిడిఎ ఉద్యోగులు, విద్యార్థులు, గిరిజన సంఘ నాయకులు, మహిళా సంఘ సభ్యులు పాల్గొన్నారు.
కురుపాం : బిర్సా ముండా 149వ జయంతి వేడుకను పురస్కరించుకొని స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాల వద్ద ఆదివాసీ గిరిజనాభ్యుదయ సంఘం ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు ఆరిక చంద్రశేఖర్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిర్సా ముండా భారతీయ ఆదిమ జాతుల స్వాతంత్య్ర పోరాట యోధుడని తెలిపారు. అనంతరం సామాజిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సంఘ నాయకులు ఎస్‌.మాణికేశ్వరరావు, వి.సింహాచలం, పి.పత్తి, టి. తోంటయ్య, గిరిజన విద్యార్థులు పాల్గొన్నారు.
గుమ్మలక్ష్మీపురం : బిర్సా ముండా జయంతోత్సవాలు స్థానిక సారథి ఒకేషనల్‌ జూనియర్‌ కాలేజీలో నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రైబల్‌ రైట్స్‌ ఫోరం అధ్యక్షులు రోబ్బా లోవరాజు మాట్లాడుతూ ఆదివాసీ విద్యార్థులు, యువత చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఇంటి కుప్పల రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి అడ్డాకుల నరేష్‌, గుజ్జివాయి సర్పంచ్‌ హిమారిక నాగేశ్వరరావు, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.