ప్రజాశక్తి-పాడేరు టౌన్: భగవాన్ బిర్సా ముండా తెచ్చిన సాంఘిక, సాంస్కృతిక విప్లవం గిరిజనుల జీవితాలనుఎంతగానో ప్రభావితం చేసిందని ఐటిడిఎ ఎపిఒలు విఎస్.ప్రభాకరరావు, ఎం.వెంకటేశ్వరరావు అన్నారు. మంగళవారం ఐటిడిఎ సమావేశ మందిరంలో బిర్సాముండా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వాతంత్య్ర పోరాటంలో బిర్సా ముండాకు విశిష్ట స్థానం ఉందన్నారు. కేవలం పాతికేళ్ల్ల వయసులో బిర్సాముండా చేసిన త్యాగాలు, సాధించిన విజయాలు అసామాన్యమైనవన్నారు. ఆయన జరిపిన పోరాటాల వల్లనే బ్రిటిష్ పాలకులు గిరిజనుల భూహక్కులను గుర్తిస్తూ చట్టాలు చేశారన్నారు.కార్యక్రమంలో ఐటిడిఎ పరిపాలన అధికారి హేమలత, తదితరులు పాల్గోన్నారు.
పెదబయలు : స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో జనజాతీయ గౌరవ దివస్ నిర్వహించారు ఈసందర్భంగా బిర్సాముండా చిత్రపటానికి ఎంపిపి బి.వరాలమ్మ్మ పూలమాల వేసి నివాళులర్పించారు. ఆదివాసీ గిరిజన చట్టాల కోసం ముండా చేసిన సేవలు ఆదర్శనీయమని, ఆయన ఆశయసాధనకు కృషి చేద్దామని ఎంపిపి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మండల పరిషత్ అడ్మినిస్ట్రేషన్ అధికారి ఎల్.పూర్ణయ్య, ఇఒపిఆర్‌డి నర్సింగరావు, పిఎసిఎస్ చైర్మన్ గంపరాయి వెంకయ్య పాల్గొన్నారు.
జిమాడుగుల : మండల కేంద్రంలోని జిటిడబ్ల్యూ పాఠశాలలో బిర్సా ముండా 148వ జయంతిని ఘనంగా నిర్వహించారు, ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ బిర్సాముండా స్ఫూర్తిగా తీసుకొని ఆదివాసీలంతా హక్కులను పరిరక్షించుకోవాలని, అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని హెచ్‌ఎం సూచించారు.కార్యక్రమంలో అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బోయిపల్లి సింహాచలం పాల్గొన్నారు










