ప్రజాశక్తి-అరకు లోయ, అరకురూరల్, అనంతగిరి:బిర్సా ముండా పోరాట యోధుడని రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ కొనియాడారు. బిర్సా ముండా జయంతి సందర్భంగా జన్ జాతీయ గౌరవ్ దివస్, విక్షిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమాన్ని అరకులోయలో గవర్నర్ బుధవారం ప్రారంభించారు. అనంతరం గవర్నర్ మాట్లాడుతూ, బిర్సా ముండా, అల్లూరి సీతారామరాజు పోరాట పటిమ మరువ లేనిదన్నారు. ఈ సందర్భంగా మారుమూల పిహెచ్‌సి ధారకొండకు రెడ్ క్రాస్ అందజేసిన అంబులెన్స్ ను గవర్నర్ ప్రారంభించారు.అనంతరం వన్ ధన్ మార్ట్, జిసిసి, ఉజ్వల యోజన, సికిల్ సెల్ అనీమియా పరీక్ష కేంద్రం, చాయాచిత్ర ప్రదర్శన స్టాళ్లను తిలకించారు. ఈ సందర్భంగా గవర్నర్ కు ఐటిడిఎ తరపున జ్ఞాపికను బహూకరించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి , పంచాయతీ రాజ్, గ్రామీణాభివృధ్ది శాఖల మంత్రి బూడి ముత్యాల నాయుడు, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, జిల్లా పరిషత్ అధ్యక్షురాలు జల్లిపల్లి సుభద్ర, అరకు శాసన సభ్యులు చెట్టి పాల్గుణ, పాడేరు శాసన సభ్యులు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజరు జైన్, గిరిజిన సంక్షేమ శాఖ సంచాలకులు మురళి, సంయుక్త కలెక్టర్ జే.శివ శ్రీనివాసు, ఐటిడిఎ ప్రాజెక్ట్ అధికారి అభిషేక్, ఎస్పీ తుహిన్ సిన్హా, ఎఎస్పి ధీరజ్, జిసిసి చైర్పర్సన్ శోభ స్వాతి రాణి, రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యులు రామలక్ష్మి, లిల్లీ సురేష్, ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్ కాస్టింగ్ సహాయ సంచాలకులు మహమ్మద్ సఫి, ట్రైకార్ డైరెక్టర్ ఇ.రవీంద్రబాబు, ఐటిడిఎ సహాయ ప్రాజెక్ట్ అధికారులు ప్రభాకర్‌రావు, వెంకటేశ్వరరావు, డిఆర్‌ఓ పి.అంబేద్కర్ పాల్గొన్నారు.
కొయ్యూరు :స్వాతంత్య్ర సమరయోధుడు బిర్సా ముండా జయంతి వేడుకలు కొయ్యూరు ఏకలవ్య మోడల్ పాఠశాలలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపాల్ జగన్నాథరావు, ఉపాధ్యాయులు శ్రీలక్ష్మి, శంకరరావు, సత్యనారాయణ, తమ్మారావు, గోవింద్ తదితరులు బిర్సా ముండా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ జగన్నాథరావు మాట్లాడుతూ, దేశంలో ఆదివాసీ హక్కుల కోసం తొలి పోరాటయోధుడు బిర్సాముండా అని కొనియాడారు.
మారేడుమిల్లి : రంప చోడవరం మండలం ఇర్లపళ్లి గ్రామంలో బిర్సా జయంతిని ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు చవలం రాంబాబు దొర, పూసం బాలు దొర, సిహెచ్ హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.
ఎటపాక : మండలంలోని పట్టుచీర గ్రామంలో బిర్సా ముండా చిత్ర పటానికి ఆదివాసీ సంక్షేమ పరిషత్తు నాయకులు నివాళులర్పించారు. కార్యక్రమంలో కుంజా శ్రీను, కణితి మధు, పాయం భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.