ప్రజాశక్తి - చిలకలూరిపేట : పట్టణంలోని శారదా హైస్కూల్‌లో చేపట్టిన నాడు-నేడు రెండో దశ కింద చేపట్టిన అభివృద్ధి పనులు సగమైనా పూర్తవ్వలేదు. అదనపు తరగతి గదుల నిర్మాణానికి మరో 10 నెలలు పట్టే అవకాశం కనిపిస్తోంది. బడులను తెరిచే నాటికి పనులన్నీ పూర్తి చేయాలనేది లక్ష్యంగా కాగా దాన్ని చేరుకోలేదు. పైగా నిర్మాణ సామగ్రి పాఠశాలల్లో అడ్డదిడ్డంగా పడి పాఠశాల నిర్వహణకు అసౌకర్యంగా మారింది. ఈ పాఠశాలలో ఆరో తరగతిలో కొత్త 350-400 మంది చేరతారని అంచనా కాగా వీరితో కలిపి పాఠశాల విద్యార్థుల సంఖ్య 1500-1600 వరకు ఉంటుంది. ఈ పాఠశాలకు ఇప్పటికే 28 తరగతి గదులు ఉండగా మరో 18 గదుల నిర్మాణం చేపట్టారు. గ్రౌండ్ ఫ్లోర్‌తోపాటు మరో రెండు ఫ్లోర్‌లుగా నిర్మిస్తున్నారు. అయితే మొదటి ఫ్లోర్ శ్లాబ్ దశ వరకే పనులు పూర్తయ్యాయి. రెండోఫ్లోర్ నిర్మాణమేమీ మొదలు కాలేదు. గతంలో రెండు మరుగుదొడ్లు ఉండగా వీటిల్లో ఒకటి మరమ్మతుకు గురైంది. కొత్తగా రెండు మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టినా అవీ పూర్తవ్వలేదు. బిల్లులు సకాలంలో మంజూరు కాకపోవడమే పనుల్లో జాప్యానికి కారణమని పేరెంట్స్ కమిటీ చెబుతోంది. పుస్తకాలను ఇంకా పంపిణీ చేయలేదు. ఆర్‌వో ప్లాంట్ నిర్వహణ సరిగా లేక తాగునీటి కోసం బోరుపై విద్యార్థులు ఆధారపడుతున్నారు. ఇదంతా ఒకెత్తయితే డిజిటల్ విద్య అంటూ ప్రభుత్వం హడావుడి చేస్తుండగా ఈ పాఠశాలలో ఒక్కటి కూడా ఇన్‌స్టాల్ చేయలేదు.










