ప్రజాశక్తి- వేపాడ : గామీణ ప్రాంతాల రహదారుల నిర్మాణాలకు గ్రహణం పట్టింది. ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్లు పనులు నిలిపేశారు. రహదారి పనులు ఎక్కడికక్కడ ఆగిపోవడంతో వాహనదారులకు, ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. అర్ధాంతరంగా పనులు నిలిపేసిన రోడ్లపై క్వారీ లారీలు, భారీ వాహనాలు రాకపోకలు సాగించడంతో రహదారులు ఛిద్రమవుతున్నాయి. దీంతో ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నారు.
శ్రీ వేపాడ మండలంలో సోం ప్రురం జంక్షన్ నుంచి ఆనందపురం కూడలి వరకు 16 కిలోమీటర్ల రోడ్డు పనులు ప్రారంభించి ఏళ్లు గడుస్తున్నాయి. నిధులు మంజూరైనప్పటికీ చేసిన పనులకు బిల్లులు చెల్లించక పోవడం మధ్యలో కాంట్రాక్టరు రోడ్డు పనులు నిలిపేశారు. క్వారీ లారీలు అధిక లోడుతో తిరగడం వల్ల రోడ్డు నిర్మాణానికి వేసిన మెటల్ తేలిపోతోంది. దీంతో రాకపోకలకు ఇబ్బందిగా తయారైంది.
వీలుపర్తి రోడ్డు నుంచి కడకొండకు సుమారు కిలోమీటర్ వరకు వేసిన పక్కా రోడ్డు బూడిదగా మారిపోయింది. నిధులు మంజూరైనట్లు చెప్పడమే తప్ప పనులు మాత్రం చేపట్టకపోవడంతో గిరిజన గ్రామాల ప్రజలకు రాకపోకలకు అవస్థలు పడుతున్నారు.
మండల ప్రధాన రహదారి నుంచి ఆతవ గ్రామానికి వెళ్లే రెండు కిలోమీటర్ల రోడ్డు పూర్తిగా శిథిలమైంది. ఎమ్మెల్యే గ్రాంట్ నుంచి నిధులు మంజూరుకావడంతో కాంట్రాక్టరు పని ప్రారంభించారు. రోడ్డు వేసేందుకు మొత్తం చదును చేశారు. చేసిన పనులకు బిల్లులు చెల్లించకపోవడంతో పని నిలిపివేశారు. రోడ్డుపై రాళ్లు తేలిపోవడంతో విద్యార్థులు, ప్రజలు రోడ్డుపై ప్రయాణం సాగించడానికి నరకం అనుభవిస్తున్నారు.
విశాఖపట్నం నుంచి శృంగవరపుకోట మీదుగా అరకు వెళ్లే హైవే నుంచి ముకుందపురం గ్రామానికి ఉన్న సుమారు ఒకటిన్నర కిలోమీటర్ల మేర రోడ్డు గోతులమయమైంది. ప్రమాదకరంగా గోతులు ఏర్పడటంతో ఈ రోడ్డుపై ప్రయాణించడానికి ముకుందపురం, ఓబులయ్యపాలెం గ్రామాల ప్రజలు భయపడుతున్నారు. మరోవైపు రోడ్లన్నీ గోతులమయం కావడంతో వాహనాలు మరమ్మతులకు గురవుతున్నాయని వాహనదారులు సైతం బెంబేలెత్తిపోతున్నారు.