సిఐటియు జిల్లా అధ్యక్షుడు బోనంగి చిన్నయ్యపడాల్
ప్రజాశక్తి పాడేరు: పాడేరు ఏజెన్సీలో ఆశ్రమ వసతి గహాల డిప్యూటీ వార్డెన్లకు ఆరు నెలల నుంచి బిల్లులు అందక హాస్టల్స్ నిర్వహణ భారంగా పరిణమించిందని సిఐటియు అల్లూరి జిల్లా అధ్యక్షులు, బోనంగి చిన్నయ్యపడాల్ ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం మండలంలోని పలు పంచాయతీ గ్రామాలలో డిసెంబర్ 20, 21తేదీల్లో నిర్వహించనున్న సిఐటియు జిల్లా మహాసభల జయప్రదానికి ప్రచారం నిర్వహించారు.ఆశావర్కర్లకు మహాసభల కరపత్రాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, డిప్యూటీ వార్డెన గా అదనపు బాధ్యతలతో పాటు హాస్టల్స్ నిర్వహణ కోసం అప్పుల బాధ ఉపాధ్యాయులకు తప్పడం లేదని పలువురు ౖ ఆవేదన చెందుతున్నారని, దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించి హాస్టల్ బిల్లులు చెల్లించాలని కోరారు. 2019లో ఉన్న మెస్‌ఛార్జీలనే నేటికీ అమలు చేస్తున్నారని, ప్రస్తుత ధరలకు తగ్గట్టుగా వాటినీ పెంచాలని డిమాండ్ చేశారు. అల్లూరి జిల్లాలోని 11 మండలాలలో ఈ ఏడాది ఏప్రిల్, మే నెలలతోపాటు జూలై నుంచి ఇప్పటివరకు ఆరునెలల హాస్టల్ బిల్లులు చెల్లించక డిప్యూటీ వార్డెన్లు అప్పుచేసి హాస్టల్స్ నిర్వహించి ఇబ్బందులు పడుతున్నారన్నారు. తక్షణమే హాస్టల్ బిల్లు బకాయిలన్నీ చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు పాంగి ధనుంజరు, ఆశ వర్కర్లు పార్వతి ధనలక్ష్మి చిన్నమ్మి పాల్గొన్నారు.










