May 04,2023 21:51

బిల్లులో మహాప్రభో..!

ప్రజాశక్తి - శ్రీకాకుళం ప్రతినిధి : వంశధార స్టేజ్‌-2, ఫేజ్‌-2 పనులను జూన్‌ నాటికి పూర్తి చేయాలని ఒకవైపు చెప్తోంది. మరోవైపు హైలెవల్‌ కెనాల్‌ను ఆగస్టులో ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి గత నెల 19వ తేదీన మూలపేట పోర్టు శంకుస్థాపన పనుల సందర్భంగా ప్రకటించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి గత నెల 19వ తేదీన జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంలో ఆగస్టులో హైలెవల్‌ కెనాల్‌ను ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. పనులు వేగవంతం చేయాలని చెప్తున్న ప్రభుత్వం, ఆ మేరకు నిధులు విడుదల చేయడం లేదు. వంశధార, హైలెవల్‌ కెనాల్‌ పనులు చేపడుతున్న కాంట్రాక్టర్లకు ఏడాదికి పైగా బిల్లులు చెల్లించడం లేదని తెలుస్తోంది. బడ్జెట్‌లో నిధులు కేటాయించినా ప్రభుత్వం సకాలంలో డబ్బులు ఇవ్వకపోవడంతో, ఆ ప్రభావం సాగునీటి ప్రాజెక్టు పనులపై పడుతోంది. దీంతో జులై నాటికి ప్రాజెక్టులు పూర్తి చేసి ఖరీఫ్‌ నీళ్లిస్తామన్న ప్రభుత్వ మాటలపై రైతుల్లో ఆశలు సన్నగిల్లుతున్నాయి.

        వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత మరోమారు ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని రూ.2,671.52 కోట్లకు పెంచారు. రెండున్నరేళ్ల కాలంలో నిర్మాణ పనుల్లో పెద్దగా పురోగతి కనిపించడం లేదు. వీటిలో 87 ప్యాకేజీ పనులు 83 శాతం పూర్తయ్యాయి. అంచనా వ్యయం రూ.173.41 కోట్లు కాగా, ఇప్పటివరకు రూ.124.87 కోట్లు ఖర్చు చేశారు. లైనింగ్‌ పనులకు సంబంధించి ఇప్పటివరకు 7.63 కిలోమీటర్లు పూర్తి కాగా, మరో 3.83 కి.మీ మేర లైనింగ్‌ పనులు పురోగతిలో ఉన్నాయి. అండర్‌ పాసేజ్‌లు, వంతెనలు తదితర నిర్మాణాలు 25 వరకు నిర్మించాల్సి ఉండగా, ఇప్పటివరకు 24 నిర్మించారు. ఒప్పంద కాలపరిమితిని ఈ ఏడాది జూన్‌ 30వ తేదీ వరకు పొడిగించారు. 88 ప్యాకేజీ పనులు 92 శాతం పూర్తయ్యాయి. అంచనా వ్యయం రూ.195.15 కోట్లు కాగా, ఇప్పటివరకు రూ.177.85 కోట్లు ఖర్చు చేశారు. లైనింగ్‌ పనులకు సంబంధించి ఇప్పటివరకు 16.6 కి.మీ పూర్తి కాగా, మరో 1.19 కి.మీ మేర లైనింగ్‌ పనులు పురోగతిలో ఉన్నాయి. అండర్‌ పాసేజ్‌లు, వంతెనలు తదితర నిర్మాణాలు 37 వరకు నిర్మించాల్సి ఉండగా, ఇప్పటివరకు 36 నిర్మించారు. ప్యాకేజీ పనులు అక్టోబర్‌ 28, 2017 నాటికి పూర్తి కావాల్సి ఉంది. పలు కారణాలతో పనులు సకాలంలో కాకపోవడంతో, ఆరు నెలలకోసారి పొడిగించారు. పనులు పూర్తి చేసేందుకు చివరిసారిగా ఈ ఏడాది జూన్‌ 30వ తేదీ నాటికి పూర్తి చేసేలా ఒప్పందం కాలపరిమితిని పొడిగించారు.
 

రిజర్వాయర్‌ పనులు 93 శాతం పూర్తి
హిరమండలం రిజర్వాయరు పనుల అంచనా వ్యయం రూ.419.23 కోట్లు కాగా, ఇప్పటివరకు రూ.376.31 కోట్లను వెచ్చించారు. ఇప్పటివరకు 93 శాతం మాత్రమే పూర్తయ్యాయి. రెండున్నరేళ్లలో పనుల్లో పెద్దగా పురోగతి కనిపించడం లేదు. పనులు సకాలంలో పూర్తి కాకపోవడంతో అప్పట్నుంచి ఆరు మాసాలు చొప్పున పొడిగిస్తూ వచ్చారు. చివరిసారిగా జూన్‌ 30వ తేదీ వరకు మరోసారి పొడిగించారు.
 

హైలెవల్‌ కెనాల్‌ 75 శాతం పూర్తి
ఎల్‌.ఎన్‌ పేట, సరుబుజ్జిలి, బూర్జ మండలాల్లో ఉన్న ఐదు వేల ఎకరాలకు సాగునీరందించేందుకు 2017లో వంశధార, నాగావళి నదుల అనుసంధానం చేస్తూ హైలెవల్‌ కెనాల్‌ పనులు ప్రారంభించారు. ప్రాజెక్టు పనులను నెల్లూరుకు చెందిన పి.వి రమణయ్య అండ్‌ కంపెనీకి రూ.57.99 కోట్లకు పనులను అప్పగించింది. అనుసంధాన పనులు 2020 నాటికే పూర్తి కావాల్సి ఉంది. పలుమార్లు ఒప్పంద కాలపరిమితిని పొడిగించిన ప్రభుత్వం చివరిసారిగా ఈ ఏడాది జూన్‌ 30వ తేదీ లోగా పూర్తి చేసేలా కాలపరిమితిని పొడిగించింది. హైలెవల్‌ వ్యయం రూ.145.34 కోట్లు కాగా, ఇప్పటివరకు రూ.102.30 కోట్లను ఖర్చు చేశారు.
 

సుమారు రూ.40 కోట్లు పెండింగ్‌
పనులు వేగవంతం చేయాలని చెప్తున్న ప్రభుత్వం, ఆ మేరకు నిధులు విడుదల చేయడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వంశధార ప్రాజెక్టు స్టేజ్‌-2 ఫేజ్‌-2 పనులకు సంబంధించి రూ.35.66 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇందులో 87 ప్యాకేజీ కాంట్రాక్టర్‌కు రూ.11.37 కోట్లు, 88 ప్యాకేజీకి రూ.12.11 కోట్లు చెల్లించాల్సి ఉంది. మొత్తం రూ.32.14 కోట్లు పెండింగ్‌ బిల్లులు ఉన్నాయి. హైలెవల్‌ కెనాల్‌కు సంబంధించి రూ.3.52 కోట్లు చెల్లించాల్సి ఉంది. వీటితోపాటు 88 ప్యాకేజీకి రూ.2.89 కోట్లు, హైలెవల్‌ కెనాల్‌కు సంబంధించి రూ.94 లక్షల మేర సంబంధిత కాంట్రాక్టర్లు పనులు చేశారు. బిల్లును అప్‌లోడ్‌ చేయాల్సి ఉంది. మొత్తం మీద రూ.39.49 కోట్లు మేర బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. గతేడాది ఫిబ్రవరిలో చెల్లింపులు చేసిన ప్రభుత్వం, ఇప్పటివరకు వారికి బిల్లులు చెల్లించలేదని తెలుస్తోంది. బిల్లులు రాకపోవడంతో పెట్టుబడులు పెట్టలేక కాంట్రాక్టర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పనులు ఆపకుండా ఏదో ఉన్నంత వరకు కానిస్తున్నారు. బిల్లుల చెల్లింపుల్లో జరుగుతున్న జాప్యం ప్రాజెక్టు పనులపై ప్రభావం చూపుతోంది. అంతిమంగా రైతులకు నష్టం వాటిల్లనుంది.