ప్రజాశక్తి - మంగళగిరి : విద్యుత్ సంస్థల నష్టాల పేరుతో పేదలపై విద్యుత్ చార్జీల పెంచడం తగదని సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శి పాశం రామారావు అన్నారు. విద్యుత్ చార్జీల పెంపుపై మంగళగిరి పట్టణంలోని రత్నాల చెరువులో ఆదివారం సిపిఎం ఆధ్వర్యంలో ఇంటింటి సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ 2014 నుండి 2019 వరకు టిడిపి ప్రభుత్వం హయాంలో విద్యుత్ కొనుగోలు, అమ్మకాలు వలన విద్యుత్ సంస్థకు రూ.2,900 కోట్ల నష్టం వచ్చిందనే పేరుతో ఇప్పుడు విద్యుత్ ఛార్జీలు పెంచారని విమర్శించారు. ట్రూ ఆఫ్ ఛార్జీలు, కస్టమర్ ఛార్జీలు, తదితర ఛార్జీల పేరుతో 36 నెలలు వసూలు చేయడం తగదన్నారు. ఇప్పటికే 12 నెలల పాటు వసూలు చేశారని చెప్పారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం విద్యుత్ సంస్కరణల పేరుతో వ్యవసాయ పంపు చెట్లకు మీటర్లు బిగించడం రైతులకు తీవ్ర నష్టమని, బిజెపి ప్రభుత్వ విధానాలను రాష్ట్రలోని వైసిపి ప్రభుత్వం తూచా తప్పకుండా అమలు చేస్తోందని విమర్శించారు. దీనిపై ఆందోళనను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఇదిలా ఉండగా అసలు కంటే అదనపు బిల్లులే ఎక్కువగా ఉన్నాయని, 18 యూనిట్లు, 20 యూనిట్లు కరెంట్ కాల్చిన వారికి కూడా రూ.300కు పైగా బిల్లులు వచ్చాయని పలువురు వాపోయారు. పూరిపాకలో ఉన్నప్పటికీ కరెంటు చార్జీలు ఎక్కువగా వస్తున్నాయని నాయకులకు తెలిపారు. రూ.100 కరెంటు కాలిస్తే ఇతర ఛార్జీల పేరుతో మరొక రూ.100 కలిపి బిల్లు వస్తోందని పలవురు ఆవేదనకు గురయ్యారు. 22 యూనిట్లు కాల్చుకుంటే రూ.205 బిల్లు వచ్చిందని జి.సుబ్బమ్మ, 18 యూనిట్లు కాల్చుకుంటే రూ.180 బిల్లు వచ్చిందని కె.సుబ్బారావు వాపోయారు.
పేదలు ఎక్కడ నివాసం ఉంటే అక్కడే ఇటి పట్టా ఇవ్వాలని రామారావు డిమాండ్ చేశారు. రాజధానిలో సెంటు స్థలం ఇచ్చామని చెప్పి ఇక్కడ ఉన్న ఇళ్లను తొలగిస్తే ఉద్యమిస్తామని హెచ్చరించారు. మంగళగిరి పట్టణంలో 4000 మంది ప్రభుత్వ భూముల్లోనూ, ప్రాంతంలోనూ 50 ఏళ్లుగా ఇళ్లేసుకుని నివాసం ఉంటున్నారని వారికి అక్కడే పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏ వసతులు లేని ప్రాంతంలో సెంటు స్థలమిస్తే పేదలు ఇక్కడ నుండి కదలరని అన్నారు. పిల్లలు చదువు ఎలా చదువుకుంటారని ప్రశ్నిం చారు. రత్నాల చెరువు నివాసముంటున్న వారు ఇల్లు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎస్‌ఎస్ చెంగయ్య, సీనియర్ నాయకులు పి.బాల కృష్ణ, స్థానిక నాయకులు ఎం.చంద్ర, ఎం.చలపతిరావు, ఇ.కాటమరాజు, కె.వెంక టేశ్వరరావు, జె.భార్గవ, జి.దుర్గాప్రసాద్, బి.స్వామినాథ్, నాగరాజు, నాగేష్, కె.శ్రీనివాసరావు, పి.ఆదియ్య పాల్గొన్నారు.










