యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ రీజనల్ మేనేజర్ హామీ
ప్రజాశక్తి - ఆగిరిపల్లి
మండలంలోని నరశింగపాలెం, సగ్గూరు, తోటపల్లి గ్రామాల్లో డ్వాక్రా సంఘాల మహిళల నుంచి ఆయా గ్రామాల యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బిజినెస్ కరస్పాండెట్లు కాజేసిన సొమ్మును ఈ నెల 31వ తేదీలోపు చెల్లిస్తామని యూనియన్ బ్యాంక్ అధికారులు హామీ ఇచ్చారు. మండల పరిధిలోని నరశింగపాలెంలో 35 డ్వాక్రా గ్రూపులకు సంబంధించి రూ.76.43 లక్షలు, సగ్గూరులో 29 డ్వాక్రా గ్రూపులకు సంబంధించి రూ.29లక్షలు, తోటపల్లిలో నాలుగు డ్వాక్రా గ్రూపులకు సంబంధించి రూ.1.72లక్షలను యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో ఎంఒయు చేసుకొన్న ఇంట్రెగ్రా ఏజెన్సీ ద్వారా నియమితులైన బిజినెస్ కరస్పాండెట్లు కాజేశారు. బాధిత మహిళలు జగనన్న సురక్ష కార్యక్రమంలో స్థానిక ఎంఎల్‌ఎ మేకా వెంకట ప్రతాప్ అప్పారావు దృష్టికి తీసుకెళ్లారు. డ్వాక్రా మహిళలకు ఈ నెల 21 తేదీకల్లా న్యాయం చేయాలని, లేకపోతే ఆందోళన చేపడతామని చెప్పారు. శుక్రవారం ఎంఎల్‌ఎ ఆగిరిపల్లి యూనియన్ బ్యాంక్ వద్దకు పెద్దఎత్తున మహిళలతో చేరుకొని బ్యాంకు అధికారులతో చర్చించారు. కరస్పాండెట్లు కాజేసిన సొమ్మును రికవరీ చేసి మహిళల ఖాతాల్లో ఈ నెల 31వ తేదీలోపు జమ చేస్తామని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ రీజనల్ మేనేజర్ హరీష్ రాతపూర్వకంగా హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తహాశీల్దార్ ఎం.ఉదయభాస్కరరావు, డిఎస్‌పి అశోక్‌కుమార్ గౌడ్, నూజివీడు రూరల్ సిఐ ఆర్.అంకబాబు, ఎస్‌ఐ చంటిబాబు, యూనియన్ బ్యాంక్ మేనేజర్ జగన్మోహానరావు, వెలుగు ఎపిఎం బి.రామకృష్ణ పాల్గొన్నారు.










