ప్రజాశక్తి - పల్నాడు జిల్లా : బిజెపితో జగన్‌మోహన్‌రెడ్డి లోపాయకారిగా సంసారం చేస్తూ బయటకు మాత్రం బిజెపి-టిడిపి మళ్లీ కలుస్తున్నాయంటూ తప్పుడు ప్రచారం చెపిస్తున్నారని శాసన మండలి మాజీ చైర్మన్, టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు మొహమ్మద్ షరీఫ్ విమర్శించారు. పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలోని ఒ ఫంక్షన్ హాల్‌లో పల్నాడు జిల్లా ముస్లిమ్ మైనారిటీల ఆత్మీయ సమావేశం గురువారం జరిగింది. కార్యక్రమానికి జిల్లా మైనారిటీ అధ్యక్షులు సయ్యద్ అమీర్ అలీ అధ్యక్షత వహించగా షరీఫ్ మాట్లాడుతూ పేరుకే వైసీపీ ప్రభుత్వం ముస్లింలకు బడ్జెట్ లో డబ్బులు కేటాయిస్తున్నారని, కొత్త మసీదులకు సున్నం వేయడానికి కూడా వైసీపీ నేతలకు మనస్సు రావడం లేదన్నారు. ఉర్దూ అకాడమీకి జగన్ మోహన్ రెడ్డి ఒక్క పైసా ఖర్చు చేయలేదని, చివరికి వస్క్స్ బోర్డు ఆస్తులను సైతం వైసీపీ నేతలు ఆక్రమించుకున్నారన్నారు. టిడిపి పల్నాడు జిల్లా అధ్యక్షులు జివి ఆంజనేయలు మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం వచ్చిన తరువాత మాచర్ల, గురజాలలో ముస్లిములపై దాడులు జరిగాయన్నారు. గురజాలలో ముస్లిం వ్యక్తిని వైసిపికి చెందిన నాయకులు నడిరోడ్డు పై కత్తులతో నరికారని మండిపడ్డారు. రాష్ట్ర ముస్లిం మైనారిటీ అధ్యక్షుడు ముస్తాక్ అహమ్మద్ మాట్లాడుతూ మాచర్లలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దౌర్జన్యాలకు అంతులేదని, నరసరావుపేటలో మతపెద్ద ఇబ్రహీంను ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి అనుచరులు నడిరోడ్డు పై నరికి చంపారని అన్నారు. దాడులపై కేసులు పెట్టనివ్వడం లేదని విమర్శించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు, మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్, నరసరావుపేట నియోజకవర్గ ఇన్‌ఛార్జి డాక్టర్ చదలవాడ అరవిందబాబు టిడిపి రాష్ట్ర కార్యదర్శి నల్లపాటి రామచంద్రప్రసాద్ తదితరులు మాట్లాడారు.










