
సిపిఎం జిల్లా కార్యదర్శి బలరాం
ప్రజాశక్తి - ఆచంట
సహజ సంపదను కార్పొరేట్లకు దోచిపెడుతున్న కేంద్రంలోని బిజెపి ప్రభుత్వంతో వైసిపి అంటకాగుతోందని సిపిఎం జిల్లా కార్యదర్శి బి.బలరాం విమర్శించారు. మంగళవారం సాయంత్రం స్థానిక ప్రజా సంఘాల కార్యాలయంలో సిపిఎం విస్తృతస్థాయి సమావేశం మండల కమిటీ సభ్యులు వద్దిపర్తి అంజిబాబు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో బలరాం పాల్గొని మాట్లాడుతూ రాష్ట్రంలో సామాజిక సాధికార యాత్ర చేపట్టే నైతిక హక్కు వైసిపి ప్రభుత్వానికి లేదన్నారు. ప్రతిపక్షంలో ఉన్న టిడిపి కూడా మోడీ మోసకారి విధానాలకు వంత పాడుతోందన్నారు. అదానీ ప్రయోజనం కోసమే రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలను రాష్ట్ర ప్రభుత్వం పెంచిందని విమర్శించారు. రైతుల ఆత్మహత్యలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలే కారణమన్నారు. ఒక పక్క పంటలు ఎండిపోతుంటే ఆదుకోకుండా మంత్రులు, ఎంఎల్‌ఎలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. రాష్ట్రానికి అన్యాయం చేసిన బిజెపికి వైసిపి, టిడిపి, జనసేన మద్దతు ఇస్తుండడం రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేయడమేనని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో బిజెపితో అంట కాగే వాళ్లను చిత్తుచిత్తుగా ఓడించాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఒకపక్క ధరలు పెరుగుదల, నిరుద్యోగం, భూ సమస్యలతో ప్రజలు సతమతమవుతుంటే ప్రజా సమస్యలను గాలికొదిలి రాజకీయ ప్రచారం కోసం బస్సు యాత్రలు చేపట్టడం సిగ్గుచేటని విమర్శించారు. ప్రజా సమస్యలే ఎజెండాగా రాష్ట్ర జాతా నవంబర్ 7, 8, 9 తేదీల్లో జిల్లాలో పర్యటిస్తుందని, ఈ జాతాకు సిపిఎం నాయకులు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులు, అభిమానులు వేలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలను ఎండగట్టేందుకు నవంబర్ 15న విజయవాడలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ బహిరంగ సభకు వేలాదిమంది తరలివచ్చి ప్రజారక్షణ భేరి బహిరంగ సభను విజయవంతం చేయాలని బలరాం పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కేతా గోపాలన్, పెనుగొండ, పెనుమంట్ర మండల కార్యదర్శులు ఎస్.వెంకటేశ్వరరావు, సుబ్బరాజు, విజరు కుమార్, వద్దిపర్తి శ్రీనివాసరావు, రంగారావు, కుసుమే జయరాజు, పి.మోహన్ రావు, కేతా నాగాంజనేయులు, సరళ రాధాకృష్ణ, మట్టపర్తి ఆంజనేయులు, తలుపురి బుల్లబ్బాయి, మానుకొండ వీర్రాజు, ఉన్నమట్ల పద్మారావు, మోహన్ పాల్గొన్నారు.