
ప్రజాశక్తి - కొల్లూరు
మండలంలోని తోకలవానిపాలెం గ్రామంలో ఈనెల 15న సిపిఎం ఆధ్వర్యంలో విజయవాడలో జరిగే ప్రజారక్షణభేరి బహిరంగ సభను జయప్రదం చేయాలని సిపిఎం రూపొందించిన ప్రజా ప్రణాళికలోని అంశాలను, బహిరంగ సభకు తరలిరావాలని కోరుతూ ఏర్పాటు చేసిన భారీ హోర్డింగును సిపిఎం జిల్లా కార్యదర్శి సిహెచ్ గంగయ్య గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గంగయ్య మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గత ఎన్నికల ముందు అనేక వాగ్దానాలు ఇచ్చి అమలు చేయడంలో విఫలమయ్యాయని అన్నారు. అనేక మంది చదువుకున్నవారికి ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించడంలో విఫలమయ్యాయని అన్నారు. కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వడం లేదన్నారు. ఉపాధి హామీ పథకాలకి కేంద్ర ప్రభుత్వం నిధులు తగ్గించడం పేద ప్రజలను మోసం చేయడమేనని అన్నారు. రాబోయే రోజుల్లో 200రోజుల పని దినాలు కల్పించి కనీస వేతనం రూ.600 ఇవ్వాలని కోరారు. రాబోయే ఎన్నికల్లో రాష్ట్రానికి అన్యాయం చేసిన కేంద్ర ప్రభుత్వాన్ని ఓడించాలని కోరారు. బిజెపికి మద్దతిస్తున్న వైసిపి, టిడిపి, జనసేనలను ఓడించి వామపక్ష పార్టీలను బలపరచాలని కోరారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు, సర్పంచ్ టీ కృష్ణమోహన్, సిపిఎం నాయకులు వేములపల్లి వెంకట రామయ్య, వాగోలు ఏసు, టి చిట్టిబాబు, దాసు, వి రమేష్ పాల్గొన్నారు.